వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి
యలమంచిలి: అడ్డదారులు తొక్కి అధికారం చేజిక్కించుకోవడం తెలుగుదేశం పార్టీ డీఎన్‌ఏలో ఉందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ము దునూరి ప్రసాదరాజు విమర్శించారు. గురువారం యలమంచిలి ఎంపీపీ ఎన్నికను వాయిదా వేసిన నేపథ్యంలో ముదునూరి విలేకరులతో మాట్లాడారు. యలమంచిలి, అత్తిలి, కై కలూరులో వైఎస్సార్ సీపీకి పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ ఎన్నికను వాయిదా వేయడం అప్రజాస్వామికమన్నారు. ముఖ్యంగా యలమంచిలిలో వైఎస్సార్ సీపీకి 13 మంది సభ్యులతో పూర్తి మెజార్టీ ఉంటే నలుగురు సభ్యులున్న తెలుగుదేశం, జనసేన సభ్యులను బెదిరించాల్సిన అవసరం తమకు ఏముంటుందని ప్రశ్నించారు. సాకులు చూపుతూ అధికారులు ఎన్నికను వాయిదా వేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా తమ సభ్యులు లొంగిపోరని స్పష్టం చేశారు. కూటమి నాయకులు శుక్రవారం కూడా తమ పార్టీ సభ్యులను సమావేశానికి వెళ్లకుండా అడ్డగించినా, దౌర్జన్యం చేసినా న్యాయబద్ధంగా ఎదుర్కొంటామన్నారు. ప్రలోభాలకు గురిచేసి అధికారం చేజిక్కించుకోవాలనుకోవడం నీచమైన చర్య అని ముదునూరి అన్నారు.