కూటమి కుట్రలో ఉపాధి కూలీల మోహరింపు
తణుకు అర్బన్: అత్తిలి ఎంపీపీ ఉప ఎన్నికలో ఎంపీటీసీ సభ్యులను అడ్డుకునే క్రమంలో కూటమి నాయకులు ఉపాధి హామీ పథకంం కూలీలను అస్త్రంగా ఎంచుకున్నారు. అత్తిలి ప్రధాన రహదారులు, కూడళ్లలో పురుష కూలీలను, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు నివాస రహదారికి ఇరువైపులా మహిళా కూలీలను మోహరింపజేశారు. ఇలా సుమారు 500 మందికిపైగా కూలీలను తీసుకువచ్చి వీధుల్లో నిలబెట్టారు. మీటింగ్ ఉందని చెప్పి తమను తీసుకువచ్చారని, తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంట్లోంచి వచ్చే మహిళలను పట్టుకోవాలని చెప్పారంటూ మహిళా కూలీలు ‘సాక్షి’ వద్ద వాపోయారు. కూటమి నేతలు పిలిచినా రాకపోతే ఉపాధి పనుల్లోకి రాకుండా చేస్తారనే భయంతోనే ఇక్కడకు వచ్చామని చెప్పారు. తమకు రూ.500, బిర్యానీ పొట్టం ఇస్తామని చెప్పారని కొందరు కూలీలు అన్నారు. కూలీల మస్తరును సైతం కూలీల్లో ఒకరు వేస్తూ ఉండటంపై ప్రశ్నించగా కూలీల పేర్లు నమోదు చేయమని కూటమి నేతలు చెప్పారని చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. కూలీలకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనాలు, పుచ్చకాయ ముక్కలను కూటమి నేతలు పంచారు. మండుటెండలో మహిళా కూలీలను రోడ్లపై కూర్చోబెట్టడంతో పలువురు నీరసంతో కూలబడిపోయారు. చివరకు ఎన్నిక ప్రక్రియ ముగిసిన తర్వాత కొందరికి రూ.500, మరికొందరికి రూ.300 చొప్పున ఇవ్వడంపై కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ కూలీలను స్వార్థ రాజకీయాలకు వాడుకోవడంపై అత్తిలి ప్రజలు విస్మయం వ్యక్తం చేశారు.