కోకో గింజల ధరలు తగ్గిస్తున్న కంపెనీలు
ఏలూరు (టూటౌన్): అంతర్జాతీయ మార్కెట్ ధర ప్రకారం కోకో గింజలు కొనుగోలు చేయకుండా కంపెనీలు మోసగిస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ కోకో రైతుల సంఘం, ఏపీ రైతు సంఘం, ఏపీ కౌలు రైతుల సం ఘం రాష్ట్ర నాయకులు శనివారం గుంటూరులోని ఉద్యాన శాఖ కమిషనర్ కార్యాలయంలో ఉద్యాన శాఖ డైరెక్టర్ కె.శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు వివరాలను ఏలూరులో విడుదల చేశారు. రాష్ట్ర డైరెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్ ధర ప్రకా రం కోకో గింజలు కొనుగోలు చేయాలని కంపెనీ లను ఆదేశించామని, అన్ సీజన్ గింజలు కొను గో లు సమస్యపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉందని, కోకో రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య, కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాగంటి హరిబాబు, కోకో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ, రాష్ట్ర నాయకులు గుది బండి వీరారెడ్డి, కోనేరు సతీష్ బాబు, కొసరాజు రాధాకృష్ణ మాట్లాడారు. ఉద్యాన శాఖ రాష్ట్ర డైరెక్టర్ చెప్పిన విధంగా అంతర్జాతీయ మార్కెట్ ధర ప్రకారం కంపెనీలు కోకో గింజలు కొనుగోలు చేయడం లేదని, ధరను రూ.600 నుంచి రూ.550కు తగ్గించి వేశారని, కంపెనీల ట్రేడర్లు రూ.500లకే కొంటున్నారని వివరించారు. సక్రమంగా కోకో గింజలు కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ సీజన్ కోకో గింజలను కంపెనీలు కొనుగోలు చేయడం లేదన్నారు. రాష్ట్ర ప్రభు త్వం వెంటనే స్పందించి అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో గింజలకు ధర కల్పించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని తెలిపారు.