క్రిమినల్‌ మనస్థత్వంతో వ్యవహరిస్తున్న తెలుగుతమ్ముళ్లు | - | Sakshi
Sakshi News home page

క్రిమినల్‌ మనస్థత్వంతో వ్యవహరిస్తున్న తెలుగుతమ్ముళ్లు

Published Mon, Oct 30 2023 1:12 AM | Last Updated on Mon, Oct 30 2023 9:58 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, కడప: ప్రజాక్షేత్రంలో మరోమారు చేతులెత్తాల్సిన తప్పనిసరి పరిస్థితి. ప్రజలు సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఏకపక్షంగా మద్దతిస్తున్నారు. కుట్రలు, కుతంత్రాలతో ఆ పార్టీ నేతలపై ప్రజలల్లో వ్యతిరేకత పెంచాలనే లక్ష్యం తెరపైకి వస్తోంది. వెరసి కవ్వింపు చర్యలకు దిగుతూ రెచ్చగొట్టి లబ్ధిపొందాలనే దిశగా అడుగులు పడుతున్నాయి. వైఎస్సార్‌సీపీ నేత బెనర్జీపై హత్యాయత్నం ఉదంతం అందుకు నిదర్సనంగా నిలుస్తోంది. సామాజిక సాధికార బస్సు యాత్ర రోజే దాడి చేయడం వెనుక ప్రత్యేక వ్యూహం దాగి ఉన్నట్లు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాజకీయ పార్టీలకతీతంగా అర్హులకు అందుతున్నాయి. బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలు ఏకపక్షంగా వైఎస్సార్‌సీపీకి మద్దతిస్తున్నారు. వర్గాలకు, పార్టీలకతీతంగా పేదలంతా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మరోమారు ఎంపిక చేసుకోవాలని ఆశిస్తున్నారు. అధికారంలో ఆయనుంటేనే పేదల్ని గుర్తిస్తారనే భావనలో ఉన్నారు. ఇదే విషయమై వైఎస్సార్‌సీపీ సైతం పేదల దరికి చేరి, వారు చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూనే మీకు సాయమంది ఉంటేనే వైఎస్సార్‌సీపీకి మద్దతు తెలపండని అభ్యర్థిస్తున్నారు. ‘ప్రార్థించే పెదవుల కన్నా, సాయం చేసే చేతులు మిన్న’అన్నట్లు ప్రజలు వైఎస్సార్‌సీపీకి అపారమద్దతు ప్రకటిస్తున్నారు. ఈవిషయాన్ని గ్రహించిన తెలుగుతమ్ముళ్లు కుట్ర రాజకీయాలను తెరపైకి తెస్తున్నారు.

వాణిజ్య కేంద్రమైన ప్రొద్దుటూరు టార్గెట్‌గా....
ప్రొద్దుటూరులో వైఎస్సార్‌సీపీ అత్యంత శక్తివంతంగా ఉంది. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి నాయత్వంలో పార్టీ శ్రేణులు బలంగా పనిచేస్తున్నాయి. పైగా అక్కడ సంక్షేమం, అభివృద్ధి పనుల నిమిత్తం దాదాపు రూ.3500 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. వైఎస్సార్‌సీపీని బద్నాం చేయడానికి మార్గం కన్పించక, ఎమ్మెల్యే రాచమల్లు టార్గెట్‌గా వ్యక్తిత్వ హననం దిశగా అడుగులు వేశారు. అసాంఘిక చర్యలకు పాల్పడుతున్న సోషల్‌ మీడియా కేంద్రంగా విపరీతమైన ఆరోపణలు చేయసాగారు. తెలుగుదేశం పార్టీ వైఖరి స్పష్టం కావడంతో ఎమ్మెల్యే ఏకంగా టీడీపీ ఆరోపణలపై సీబీఐ నేతృత్వంలో విచారణ చేపట్టాలని స్వయంగా రాతపూర్వకంగా అభ్యర్థించారు. అప్పట్లో మిన్నకుండి పోయిన టీడీపీ శ్రేణులు ఇటీవల క్రికెట్‌ బెట్టింగ్స్‌ వ్యవహారం తెరపైకి తెచ్చారు.

ఎమ్మెల్యే పరోక్ష సహకారంతో చేపడుతున్న ఆరోపణల పర్వాన్ని అందుకున్నారు. తెలివిగా వ్యవహరించిన ఎమ్మెల్యే రాచమల్లు ప్రజాప్రతినిధులతో కలిసి స్వయంగా ఎస్సీ సిద్ధార్థకౌశల్‌ని కలిసి క్రికెట్‌ బెట్టింగ్‌కు కట్టడి చేయాలని అభ్యర్థించారు. టీడీపీ కుటిల ఎత్తులను ఎప్పటికప్పుడు కట్టడి చేస్తూ వచ్చారు. ఎన్ని ఎత్తులు వేసినా ప్రతికూలంగా మారుతోండడంతో ప్రత్యక్షదాడులకు పాల్పడి రెచ్చగొట్టి భారీ స్థాయిలో అల్లర్లు సృష్టించాలనే వ్యూహం పన్ని సామాజిక సాధికార యాత్ర రోజు అమలు చేసినట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

అంగళ్లు ఘటన నేపథ్యంలోనే బీజం...
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో వైఎస్సార్‌సీపీ బలంగా ఉందన్నది జగమెరిగిన సత్యం. అక్కడ టీడీపీ పుంజుకోవాలంటే స్థానికంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులకు పాల్పడి, ప్రతిదాడులు ఉండాలని టీడీపీ ఎత్తుగడ వేసింది. వెరసి ప్రత్యక్షంగా చంద్రబాబు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు. ఆమేరకు దాడి, ప్రతిదాడుల ఘటనలు అక్కడ తెరపైకి వచ్చాయి. ఈవ్యవహారం ఆగస్టు 4న చోటుచేసుకుంది. అచ్చం అలాంటి కవ్వింపు చర్యలను ప్రొద్దుటూరులో అవలంభించారు. శనివారం సామాజిక సాధికార యాత్ర సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కానున్నట్లు పసిగట్టారు.

అదే రోజు పేద వర్గాలకు చెందిన క్రియాశీలక వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై హత్యాయత్నం చేపడితే, ఎమ్మెల్యే రాచమల్లుకు సంబంధం లేకుండానే ప్రతిదాడులకు పాల్పడుతారని అంచనాకు వచ్చారు. ప్రొద్దుటూరు పట్టణం అల్లర్లతో మారుమోగాలని భావించారు. ఆమేరకే తెలుగుయువత అధ్యక్షుడు భరత్‌కుమార్‌రెడ్డి, రామిరెడ్డిలు వైఎస్సార్‌సీపీకి చెందిన బెనర్జీపై హత్యాయత్నానికి పాల్పడినట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇద్దరు కూడా టీడీపీ ఇన్‌చార్జి గండ్లూరు ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి అత్యంత సన్నిహితులు కావడం విశేషం.

ఒక దాడి...బహుళ ప్రయోజనాలు....
బెనర్జీపైనే హత్యాయత్నానికి పాల్పడడం వెనుక వ్యూహం కూడా దాగి ఉన్నట్లు తెలుస్తోంది. మున్సిఫల్‌ వైస్‌ చైర్మన్‌ బంగారురెడ్డికి బెనర్జీ సన్నిహితుడు. బెనర్జీని హత్య చేస్తే బంగారురెడ్డి అనుచరులు చెలరేగిపోయి, ప్రతిదాడులు చేస్తారనేది టీడీపీ అసలు లక్ష్యంగా కన్పిస్తోంది. ఇలా ప్రతిదాడులు చెలగేరితే ఎమ్మెల్యేకు ఆ బురద అంటించి, వాణిజ్య వర్గాల నుంచి అపార మద్దతు పొందే అవకాశం ఉంది. అలాగే ఈ వ్యవహారంతో వైఎస్సార్‌సీపీని దీటుగా ఎదుర్కొనే శక్తి తనకే ఉందని టీడీపీలో చెప్పకనే ప్రకటించుకోవడం, ఎమ్మెల్యే టికెట్‌కు అడ్డుగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులరెడ్డి, లింగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సురేష్‌నాయుడుల కంటే పైచేయి సాధించడం.. ఇలా బహుళ ప్రయోజనాలు ఆశించిన తర్వాతే వ్యూహాన్ని హత్యాయత్నం అమలు చేసినట్లు విశ్లేషకులు వెల్లడిస్తుండడం గమనార్హం.

ప్రవీణ్‌కుమార్‌రెడ్డితో సహా మరో ఇద్దరిపై కేసు
ప్రొద్దుటూరులోని గాంధీరోడ్డులో వైఎస్సార్‌సీపీ కార్యకర్త బెనర్జీపై జరిగిన దాడి సంఘటనలో భరత్‌కుమార్‌రెడ్డి, రాము అలియాస్‌ రామ్మోహన్‌రెడ్డితో పాటు కుట్రలో భాగస్వామి అయిన ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఆదివారం ఇన్‌చార్జి డీఎస్పీ నాగరాజు తెలిపారు. టీడీపీ ఇన్‌చార్జి ఉక్కు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అనుచరుడైన భరత్‌కుమార్‌రెడ్డి పాత కక్షలను మనసులో పెట్టుకొని బెనర్జీని కత్తితో విచక్షణా రహితంగా నరికాడన్నారు.

తీవ్ర గాయాలైన అతన్ని చికిత్స నిమిత్తం కేవీఆర్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారన్నారు. ప్రస్తుతం బెనర్జీ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ప్రత్యక్ష సాక్షి వెంకటరామిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కుట్ర, హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని డీఎస్పీ తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి లోతైన దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ నాగరాజు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement