
నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
పులివెందుల: ఇటీవల ఈదురు గాలులు, వర్షానికి అరటి గెలలు నేలకూలి రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని భాకరాపురంలో ఉన్న వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అధికారుల చేత పంట నష్టం అంచనా వేసి నివేదికలు తెప్పించుకుని నష్టపరిహారం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం అరటి రైతులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అనంతరం ఆయన ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
దక్షిణ మధ్య రైల్వే జీఎంకు లేఖ
కడప రైల్వేస్టేషన్‌లో టిక్కెట్లు రిజర్వు చేసుకునే సమయంలో మార్పులు చేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌కు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి లేఖ రాశారు. ఈ నెల 5వ తేదీ నుంచి రిజర్వేషన్ వేళలను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకు మార్పు చేశారన్నారు. రైల్వే ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పాత సమయాలను వెంటనే పునరుద్ధరించాలని కోరారు.