దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అంచనాల్ని మించి వృద్ధి సాధించింది. క్యూ3లో నికర లాభం 10.9 శాతం ఎగిసి రూ. 6,778 కోట్లకు చేరింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో లాభం రూ.6,110 కోట్లు. తాజా క్యూ3లో మొత్తం ఆదాయం 8.7 శాతం వృద్ధితో రూ.27,364 కోట్ల నుంచి రూ. 29,735 కోట్లకు పెరిగింది. రెండో త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 2.9 శాతం, ఆదాయం 1.5 శాతం మేర పెరిగాయి. నిర్వహణ లాభం రూ. 7,733 కోట్లుగా నమోదైంది. షేరు ఒక్కింటికి రూ. 6.5 మేర డివిడెండ్ ఇవ్వనున్నట్లు టీసీఎస్ తెలిపింది.