చెన్నైలో ముగిసిన వందేళ్ల ఇండియన్ సినిమా వేడుకలు | The end of the century Indian Film Festival in Chennai | Sakshi
Sakshi News home page

Published Wed, Sep 25 2013 7:28 AM | Last Updated on Thu, Mar 21 2024 8:50 PM

సినిమాలు సామాజిక బాధ్యతను విస్మరించరాదని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉద్బోధించారు. నేడు సంఘంలో ప్రబలుతున్న దురాచారాలను నిర్మూలించే విధంగా సినిమాలు నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో మంగళవారం జరిగిన శతవసంతాల భారతీయ సినిమా ముగింపు వేడుకలకు ప్రణబ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఉద్వేగపూరితమైన ప్రసంగం చేశారు. సినిమా ఒక బలమైన సాధనమని, ఇటువంటి బలమైన ఆయుధాన్ని సమాజ ఉద్ధరణకు వాడాలని ఆయన పిలుపునిచ్చారు. మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలను, కుల ఘర్షణలను తూర్పారబట్టే అంశాలతో ఎందుకు సినిమాలు తీయలేకపోతున్నారని ప్రణబ్ ప్రశ్నించారు. నేటి చలన చిత్రాల్లో అశ్లీల, అసభ్య, హింసాత్మక సన్నివేశాల తీవ్రత ఎక్కువగా ఉంటోందని, వీటికి ప్రాధాన్యత ఇవ్వవద్దని సినీ రంగ ప్రముఖులను అభ్యర్దిస్తున్నానని అన్నారు. 1913లో దాదాసాహేబ్ ఫాల్కే తన తొలి చిత్రం ‘రాజా హరిశ్చంద్ర ’ నిర్మాణంతో భారతీయ సినిమా కోసం కన్న కలల ఫలితమే నేటి వందేళ్ల సినిమా వేడుకని ప్రణబ్ గుర్తు చేశారు. గత వందేళ్ళ కాలవ్యవధిలో భారత చలన చిత్ర రంగం పలు మలుపులు తిరుగుతూ వస్తోందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వల్ల భారతీయ సినిమా బాగా వృద్ధి చెంది దేశంలోనే అత్యంత భారీ పరిశ్రమగా చెలామణి అవుతోందన్నారు. దేశంలో ఎక్కువమంది పనిచేసే పరిశ్రమ కూడా ఇదేనన్నారు. భారత చిత్రాలకు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో స్థానంతో పాటుగా పురస్కార, గౌరవాలు దక్కుతున్నాయన్నారు. మూకీల నుంచి టాకీలకూ.. టాకీల నుంచి డిజిటల్ మాద్యమాల స్థాయికి మన సినిమా ఎదిగిందన్నారు. భారత చలన చిత్ర చరిత్రలో దక్షిణాది సినిమా... భార్య వంటి ప్రముఖ పాత్రను పోషించిందన్నారు. సినిమా రంగానికి జాతీయ అవార్డులు అనేవి టానిక్ వంటివని, మన భావితరాలకు మన సినిమాల ఘనత గుర్తుండాలంటే 1940 -1970 మధ్య వచ్చినటువంటి చిత్ర రాజాలు మళ్ళీ రావాలన్నారు. ఈ దిశగా సినీ రంగం కృషి చేయాలన్నారు. ప్రసంగాల నడుమ గవర్నర్ రోశయ్య శతవసంతాల భారతీయ చలన చిత్ర విశేషాలను తెలిపే సావనీర్ కాపీని ఆవిష్కరించి, తొలి ప్రతిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అందజేశారు. తమిళనాడు గవర్నర్ రోశయ్య ప్రసంగిస్తూ, ప్రస్తుతం వస్తున్న సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అవుతున్నాయన్నారు. సారంలేని చిత్రాలకన్నా రసజ్ఞులు మెచ్చే సినిమాలు తీయడంలో సినిమారంగం శ్రద్ధ వహించాలన్నారు. సినిమా రంగం ఎందరో రాజకీయ నాయకులను తయారు చేసిందని చెబుతూ ముఖ్యమంత్రి జయ వంక చూశారు. దానికి ఆమె చిరునవ్వు నవ్వారు. తమిళ సినీరంగం ఎందరో ఇతర భాషా వ్యక్తులను అక్కరకు చేర్చుకుని వారిని గొప్ప హీరో - హీరోయిన్లుగా తీర్చిదిద్దిందన్నారు. శతవసంతాల ఈ భారతీయ సినీ పండుగ మరపురాని, మరువలేని పండగ అని రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత వ్యాఖ్యానించారు. భారత సినీరంగం ముఖ్యంగా దక్షిణాది సినీ రంగం బహుముఖ వృద్ధిలో సాగుతోందన్నారు. సినిమా రంగం దేశ ఆర్థిక ప్రగతికి ఒక ప్రధాన ఆదాయ వనరుగా ఉంటోందన్నారు. సినిమాకు అద్యులైన లూమియర్ సోదరులు తాము ఆవిష్కరించిన ఈ విభాగం భవిష్యత్తులో ఇంత ఎత్తుకు ఎదుగుతుందని ఊహించి ఉండరన్నారు. దేశ సమకాలీన సమస్యలకు - ప్రగతికి సినిమా ఒక నిలువుటద్దమన్నారు. దక్షిణాది సినీరంగం ప్రతి పదేళ్ళకు ఒక కొత్త మలుపు తిరుగుతోందన్నారు. మన చిత్రాలు సంస్కృతికి నిధులు వంటివన్నారు. కర్నాటక సమాచార మంత్రి సంతోష్‌నాగ్, కేరళ ముఖ్యమంత్రి ఒమన్ చాండీ ప్రాంతీయభాషా చిత్రా లను చేస్తున్న సేవలను, ప్రాముఖ్యతను వివరించారు. ఫిలింఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు విజయ్ కెంకా కూడా పాల్గొన్నారు. - తొలి అవార్డు జయలలితకు... ప్రథమంగా జీవిత సాఫల్య పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా నటి హోదాలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అందుకున్నారు. అనంతరం వివిధ బాషలకు చెందిన 43 మంది సినీ ప్రముఖులకు మండలి తరపున ప్రణబ్ మెమెంటోలు బహుకరించారు. అంజలిదేవి, కె.బాలచందర్, కె.విశ్వనాథ్, ఎం.ఎస్ విశ్వనాథన్, వైజయంతిమాల, ఎవిఎం శరవణన్, బాపు, కె.రాఘవేంద్రరావు, పార్వతమ్మ రాజ్‌కుమార్, అమితాబ్ బచ్చన్, మమ్ముట్టి, మోహన్‌లాల్, శ్రీదేవి, రేఖ, భారతి విష్ణువర్ధన్, అంబరీష్, రాజేంద్రసింగ్, బిఎస్ ద్వారకేష్, రవిచంద్రన్, వీరన్న, మాదవన్ నాయర్ (మధు), ఆదూర్ గోపాలకృష్ణన్, చంద్రన్, కుంచరో గోపన్న, కిరణ్, రణధీర్ రాజ్‌కపూర్, రమేష్ సిప్పీ, కమల బందాజ్వ, వినయ్‌కుమార్ చుంబే, జావేద్ అక్తర్, రమేష్ దియా, సీమా దియో, అపర్ణాసేన్, గౌతమ్ ఘోష్, ప్రజందిద్, నరేష్ కనోదియ, ప్రీతి సప్రూ, ఉత్తన్ మహోంచి, మనోజ్ తివారి, జరిసా మాగ్య మొదలగు తమిళం, తెలుగు, కేరళ, కర్నాటక, మరాఠి, బోజ్‌పూర్, బెంగాలీ భాషలకు చెందిన కళాకారులు ఈ అవార్డులను అందుకున్నారు. - తెలుగుతనం కోల్పోయిన వేదిక సినీ శతవసంతాల ముగింపు రోజు కార్యక్రమంలో అటు ప్రముఖుల లాంజ్‌లోను, వేదికపైన తెలుగుతనం కొరత కొట్టొచ్చినట్టు కనిపించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి హాజరుకాలేదు. కనీసం ఆయన తరపున ప్రభుత్వ ప్రతినిధిగా కూడా ఎవ్వరూ రాలేదు. నటుడు మాధవన్ ఇచ్చిన ఆడియో విజువల్ దృశ్య రూపకంలో ఎన్టీఆర్ పేరును ప్రస్తావించి ‘దేవదాసు’లో ఏఎన్నార్ నటించిన పాటను వేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement