నగరంలో ఒకప్పుడు తళతళ మెరిసిన హుస్సేన్‌సాగర్ ఇప్పుడు కాలుష్య కాసారంగా మారిపోయింది. నిత్యం వచ్చి పడే చెత్తా చెదారానికి తోడు.. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారైన వేలాది వినాయక విగ్రహాలు ఏటా సాగర్‌లో వచ్చి పడుతున్నాయి. బొజ్జగణపయ్యకు హంగులద్దిన కెమికల్ రంగులు స్వచ్ఛమైన నీటి రంగు మార్చేశాయి. మానవ తప్పిదాలన్నీ మన సాగరాన్ని మురికి తటాకంలా మార్చేస్తున్నాయి. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ హుస్సేన్‌సాగర్‌ను కాపాడుతుంటారు కొందరు కార్మికులు. నిత్యం టన్నుల కొద్దీ చెత్తను వెలికి తీస్తున్నారు. నిమజ్జనం రోజు.. వేలాది విగ్రహాలను ఒంటి చేత్తో బయటకు తీస్తున్నారు. సాగర్ కంపులో చిక్కుకున్న గౌరీసుతుడ్ని కాపాడేందుకు వచ్చిన ప్రమధగణాలు వీళ్లు. ఒకరకంగా చెప్పాలంటే వీళ్లు లేకపోతే సాగర్ ఇంకెంత ఉప‘ద్రవం’గా మారిపోయేదో! తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి సాగర్ ప్రక్షాళనకు నడుం బిగించినవారిలో కొందరిని ‘సిటీ ప్లస్’ తరఫున హీరో కృష్ణుడు ‘స్టార్ రిపోర్టర్’ రూపంలో పలకరించారు. - రిపోర్టర్ కృష్ణుడు