యాదవ కుటుంబంలో ముదిరిన ముసలం ఒక్క రోజు తిరక్కముందే సద్దుమణిగింది. తనయుడు అఖిలేశ్‌తోపాటు రాంగోపాల్‌పై వేసిన బహిష్కరణ వేటును సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ శనివారం హైడ్రామా నడుమ వెనక్కి తీసుకున్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలతో అఖిలేశ్ బలప్రదర్శన, బంధువైన ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ మధ్యవర్తిత్వం ఫలించింది. ‘ములాయం ఆదేశాల మేరకు అఖిలేశ్, రాంగోపాల్‌ల బహిష్కరణను తక్షణం రద్దు చేస్తున్నాం’ అని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ములాయం తమ్ముడు శివపాల్‌యాదవ్ చెప్పారు. ‘ములాయం, అఖిలేశ్‌లను కలిశా. అన్ని అంశాలూ కొలిక్కి వచ్చాయి. కలసికట్టుగా పూర్తి మెజారిటీతో ఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం.