తన దగ్గరకు రమ్మంటే రాలేదని మాజీ ప్రియురాలిపై ఓ కామాంధుడు కత్తితో విరుచుకుపడ్డాడు. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. కృష్ణా జిల్లా నందిగామ బీవీఆర్ కాలనీలో శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. పొల్లి రంగమ్మ, యోహాన్‌ల మధ్య గతంలో సన్నిహిత సంబంధం కొనసాగింది. ఐదు నెలల క్రితం యోహాన్ మరో మహిళను వివాహం చేసుకున్నాడు. దీంతో రంగమ్మ దూరం అయింది. అయితే, మళ్లీ తన దగ్గరకు రావాలంటూ రంగమ్మను యోహాన్ కోరాడు. అతడి బెదిరింపులను రంగమ్మ లెక్క చేయలేదు. దీంతో యోహాన్ శనివారం కత్తితో రంగమ్మపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆమెకు గాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రంగమ్మను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. యోహాన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.