ఇరు ప్రాంతాలకు న్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని విభజించవద్దనే తాను దీక్ష చేపట్టినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. సోమవారం ఆమె గుంటూరులో సమర దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి కట్టుబట్టలతో ఇంటి నుంచి పొమ్మన్నట్లు ఉందని విజయమ్మ వ్యాఖ్యానించారు. ఓట్లు, సీట్ల కోసమే రాష్ట్రాన్న విబజించాలని చూస్తున్నారన్నారు. కేంద్రం స్టేట్స్‌మెన్‌లా న్యాయం చేయలేదని భావిస్తున్నామని... రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని ఆమె హెచ్చరించారు. తెలంగాణలో 15 సీట్లు వస్తాయని రాష్ట్రాన్ని విభజించాలని చూస్తున్నారని విజయమ్మ అన్నారు. సమన్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా అని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రదేశ్ను చూస్తుంటే బాధగా అనిపిస్తుందన్నారు. అధికారం ఉందికదా అని ఇష్టమొచ్చినట్లు చీల్చుతారా అని ఆమె సూటిగా ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మూడు ప్రాంతాల ప్రజలను సమానంగా చూశారని, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని కోరుకున్నారని విజయమ్మ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కరువు ప్రాంతాలైన కడప, చిత్తూరు కర్నూలు, అనంతపురం, నల్గొండ, మహబూబ్‌నగర్‌లో అనేక అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టారన్నారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాలకు పరిష్కారం దొరికినప్పుడే విభజన అని వైఎస్ అన్నారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ హయాంలో ప్రవేశపెట్టిన ప్రాజెక్టులు ప్రస్తుతం మూలన పడ్డాయన్నారు. వైఎస్ కన్న కలలు కల్లలుగా మిగిలిపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ వారసునిగా జగన్ ఆయన బాధ్యతలు ఎత్తుకున్నారని విజయమ్మ తెలిపారు. జగన్ తరపున సమర దీక్ష చేపట్టినట్లు ఆమె వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డే దీక్ష చేయాలనుకున్నారని, అయితే జైలు నిబంధనలు కఠినతరం చేస్తారనే తాను దీక్ష చేయటం లేదని విజయమ్మ పేర్కొన్నారు. జగన్ ఎక్కడున్నా అతని ఆరాటమంతా ప్రజల కోసమేనని తెలిపారు. వైఎస్‌ఆర్‌సీపీ తరఫున సమన్యాయం చేయాలని ప్లీనరీలో కేంద్రాన్ని కోరామని విజయమ్మ తెలిపారు. ఇంతకన్నా మంచిగా తెలంగాణ వారు జీవిస్తారంటే తెలంగాణకు తాము అడ్డుకామని విజయమ్మ స్పష్టం చేశారు. తెలంగాణ వారి పట్ల అమర్యాదగా ప్రవర్తించవద్దని ఈ సందర్భంగా విజయమ్మ విజ్ఞప్తి చేశారు. శాంతియుతంగానే ముందుకు సాగుదామని సూచించారు. ప్యాకేజీ ఇవ్వాలంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అర్థంలేని డైలాగులు మాట్లాడుతున్నారని విజయమ్మ మండిపడ్డారు. నాలుగు లక్షలు కోట్లు ఇవ్వాలని ఆయన కాకి లెక్కలు చెప్పారన్నారు.