ఉమ్మడి రాజధానిలో ఇరు ప్రభుత్వాల వ్యవహారాలు చండీగఢ్ తరహాలో ప్రభుత్వ కార్యాలయాల విభజన ఉద్యోగులను బట్టి సచివాలయంలో భవనాల కేటాయింపు రెండు రాష్ట్రాలకు విడివిడిగా ప్రధాన ద్వారాలు డెరైక్టరేట్‌లు, కమిషనరేట్‌ల్లోనూ విభజన కొన్ని రంగాల ఉద్యోగులకే ‘ఆప్షన్లు’.. మిగతా ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతానికే సాక్షి, హైదరాబాద్: ఒకే సచివాలయం.. రెండు ప్రభుత్వాలు, వివిధ శాఖల డెరైక్టరేట్‌లు, కమిషనరేట్ కార్యాలయాల్లోనూ వేర్వేరుగా పరిపాలన.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ, పదేళ్ల పాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో జరగనున్న పరిణామమిది. ప్రస్తుతం రాష్ట్ర పాలనకు కేంద్ర బిందువుగా ఉన్న సచివాలయం కూడా విభజన అనంతరం రెండు భాగాలు కానుంది. సీమాంధ్ర ప్రాంతంలో కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకునే వరకు ప్రస్తుత సచివాలయం నుంచే ఇరు ప్రాంతాల ముఖ్యమంత్రులు పాలన సాగించే అవకాశముంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండే సమయంలో ఉద్యోగులు, కార్యాలయాల పంపిణీ ఏవిధంగా ఉంటుందనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. త్వరలో సచివాలయంలో ఇద్దరు ముఖ్యమంత్రులను చూస్తామని, చండీగఢ్ తరహాలో ప్రభుత్వ కార్యాలయాల విభజన ఉంటుందని ఉద్యోగులు, అధికారుల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. సచివాలయంలో ప్రస్తుతం తొమ్మిది బ్లాక్‌లు ఉన్నాయి. అసెంబ్లీ స్థానాల సంఖ్య ఆధారంగా సచివాలయంలో కొన్ని బ్లాక్‌లను తెలంగాణ రాష్ట్రానికి, మరి కొన్ని బ్లాక్‌లను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే సచివాలయానికి ఉన్న రెండు గేట్లలో ఒకదాని నుంచి ఒక రాష్ట్ర సీఎం, మరోదాని నుంచి మరో రాష్ర్ట సీఎం రాకపోకలు సాగిస్తారని చెబుతున్నాయి. ప్రస్తుత సీఎం సి బ్లాక్ నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్నందున.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి డీ బ్లాక్‌లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే అసెంబ్లీ స్థానాల ఆధారంగానే ఉద్యోగుల పంపిణీ జరుగుతుందని, ఇందుకు ప్రాతిపదికను కేంద్ర కేబినెట్ కమిటీ నిర్ణయిస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రస్తుతం ఉన్న వివిధ శాఖల డెరైక్టరేట్‌లు, కమిషరేట్ కార్యాలయాల్లోనే ఇరు రాష్ట్రాల ఉద్యోగులు పనిచేస్తారని, కేంద్ర కేబినెట్ కమిటీ రూపొందించే ప్రాతిపదిక ప్రకారం ఉద్యోగుల కేటాయింపు ఉంటుందని పేర్కొంటున్నాయి. ప్రస్తుతం సచివాలయంలో మొత్తం 5 వేల మంది ఉద్యోగులుండగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారు 3 వేల మంది, తెలంగాణ ప్రాంతం వారు రెండు వేల మంది ఉన్నారు. ఇందులో ఏప్రాంతానికి చెందిన వారు అదే ప్రాంత ఉద్యోగులుగా పనిచేస్తారని... ఏ రాష్టాన్ని ఎంపిక చేసుకోవాలనే స్వేచ్ఛ కొన్ని రంగాల ఉద్యోగులకు మాత్రమే ఉంటుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రెండు రాష్ట్రాల ‘అసెంబ్లీ’ అక్కడే.. ఉమ్మడి రాజధానిగా ఉన్నంత కాలం అసెంబ్లీ సమావేశాలను అదే భవనంలో ఒక రాష్ర్టం తరువాత మరో రాష్ట్రం నిర్వహించుకోనున్నట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. కొత్తగా హైదరాబాద్‌లో ఎటువంటి నిర్మాణాలనూ చేపట్టేది లేదని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
Published Fri, Oct 4 2013 7:42 AM | Last Updated on Thu, Mar 21 2024 9:10 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement