ప్రజలే జగన్‌ను బయటికి తెచ్చుకుంటారని వైఎస్ భారతి అన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు, సీబీఐ, కొన్ని పత్రికలు ఎంతగా విమర్శించినా జగన్‌కు ప్రజా బలం ఉందన్నారు. దేవుడనేవాడు ఉన్నడని.. న్యాయం తమవైపే ఉందని జగన్ త్వరలోనే బయటకు వస్తాడని వైఎస్ భారతి సాక్షికి రాసిన లేఖలో తెలిపారు. జగన్ గురించి, వైయస్సార్‌సీపీ గురించి కొందరు పెద్దలు ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ఇష్టమొచ్చినట్లుగా విశ్లేషణలు ఇస్తున్నారు. వారిదేం పోయింది మాటలు మాట్లాడడం, విశ్లేషణలు ఇవ్వడం చాలా సులభం. కానీ, ఇచ్చిన మాటకోసం 13 నెలలకు పైగా జైలులో ఉన్నవారికి తెలుసు, మాటల విలువ, విశ్వసనీయతకు ఉన్న ఖరీదు. రెండున్నర సంవత్సరాలు రాత్రనక, పగలనక, ఎండనక, వాననక జగన్ - ప్రజలు ఒక్కటై పుట్టిన పార్టీ వైయస్సార్‌సీపీ. ఈరోజు ఒక చెల్లి రెక్కల కష్టం మీద, ఒక తల్లి అవిశ్రాంత శ్రమ మీద, అణగారిన ప్రజల గొంతుకగా నడుస్తూ వుండే పార్టీ వైయస్సార్‌సీపీ. ఈరోజు ఏసీ హాళ్లలో కూర్చుని, వీడియో కెమెరాల ముందు నవ్వుతూ జోక్‌లు వేసేవారికి ఏమి తెలుసు - 108 టైమ్‌కు రాక, ప్రాణాలు పోగొట్టుకున్న వారి విలువ. నల్ల అద్దాలు పెట్టుకుని, చొక్కా నలగకుండా అలా వచ్చి ఇలా వెళ్లే ఈ కాంగ్రెస్, టీడీపీ నాయకులకు ఏం తెలుసు - ఆరోగ్యశ్రీ లేక ప్రాణాలు పోయేవారి గురించి. ఫీజులు సగమే ఇచ్చి, ఆ ఫీజులు పూర్తిగా కట్టలేక మధ్యలో ఆగిపోయే చదువుల గురించి, పెన్షన్ అందని ఆకలి చావుల గురించి, గిట్టుబాటు ధర లేక, ఎరువులు కొనలేక, కరెంటు సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల జరిగే రైతుల ఆత్మహత్యల గురించి, కరెంటు బిల్లులు కట్టలేక పుస్తెలు అమ్ముకునే ఆడవాళ్ల గురించి! మన బాధల గురించి, వీళ్లకు ఏమి తెలుసునని వీళ్లు మనకు నాయకులయ్యారు. మన కష్టాలు వీళ్లకు ఏమి తెలుసునని వీళ్లు మన గురించి నిర్ణయాలు తీసుకుంటున్నారు.అసలు అన్యాయానికి బాధితులు అవ్వడం అంటే వీరికి తెలుసా? అణగారిన జీవితాలంటే వీళ్లకు తెలుసా? ఒక పనికోసం చెప్పులు అరిగేలా తిరిగి, అందవలసిన న్యాయం జరగకపోయే అనుభవాలు వీళ్లకు తెలుసా? వీళ్లకు ఏమి తెలుసునని జగన్ గురించి, వైయస్సార్‌సీపీ గురించి మాట్లాడుతున్నారు. అసలు వీళ్లకు జగన్ గురించి తెలుసా? జగన్ వ్యాపారాల గురించి తెలుసా? జగన్ వ్యక్తిత్వం గురించి తెలుసా? తను చేపట్టిన ఏ పనైనా చిత్తశుద్దితో చేసేదే జగన్‌కు తెలుసు. జగన్ రావడంతో తెలుగు ప్రజానీకానికి అత్యుత్తమ నాణ్యతతో, ఒక అంతర్జాతీయ స్థాయి దినపత్రికను అందించాడు అన్నది నిజం కాదా? ఈనాడు 5,28,000 రూపాయలకు షేర్లు అమ్మితే, అంతకన్నా మంచి మెషినరీతో ఉన్న పేపర్లో, ఈనాడులో సగం విలువకే తాను షేర్లు అమ్మడం నిజం కాదా? జగన్ సాక్షిని స్థాపించడంతో పేపర్‌బాయ్ దగ్గర నుండి పైస్థాయి విలేకరి వరకు అందరికీ జీతాలు పెరిగిన మాట నిజం కాదా? ఈరోజు సాక్షి 5 సంవత్సరాల వ్యవధిలో దేశంలోనే 7వ స్థానంలో వుంది అంటే అది మన రాష్ట్రానికి గర్వకారణం అన్నమాట నిజం కాదా? ఈరోజు వరకు సాక్షి నుంచి జగన్ ఒక్క రూపాయి కూడా కనీసం జీతంగా కూడా తీసుకోలేదు అన్న మాట నిజం కాదా? ఈరోజు సాక్షి ద్వారా జగన్ 25,000 కుటుంబాలకు అంటే దాదాపు లక్ష మందికి జీవనాధారం కల్పించాడు అన్నది నిజం కాదా? ఇక భారతి సిమెంట్స్ విషయానికొస్తే దేశంలోనే అత్యుత్తమమైన సిమెంటు తయారుచేసే ఫ్యాక్టరీ అది. వెనుకబడిన కడప జిల్లాలో ఉపాధి కల్పిస్తూ వుంది. పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్కరికీ దాదాపుగా రెట్టింపు లాభాలను ఆర్జించింది. దాదాపు 5,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పిస్తూ ఉంది.జగన్ వ్యాపారాల గురించి ఇన్ని పిచ్చిమాటలు మాట్లాడే ఈ నాయకులు చెప్పగలరా - అన్యాయపు, అబద్ధపు రాతలు రాసే ఈ పత్రికా యాజమాన్యాలు చెప్పగలవా - వాళ్లు ఏమి సాధించారో? వాళ్ల వ్యాపారాల గురించి వాళ్లుమాట్లాడగలరా, చెప్పగలరా? రాజకీయాలు, వ్యాపారాల గురించి మాట్లాడే వాళ్లకు, వాళ్ల పిల్లల మాదిరిగానే జగన్ కూడా రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేనప్పుడు వ్యాపారాలు చేసుకునేవాడు అన్న సంగతి తెలియదా? వాళ్ల కొడుకులలానే, లేదా వేరే ఇతర రాజకీయ నాయకుల కొడుకుల లాగానే జగన్ అప్పుడు వ్యాపారాలు చేశాడే తప్ప, తాను రాజకీయాలలోకి వచ్చిన తరువాత వారి కక్ష సాధింపులకే సమయం కేటాయించవలసి వచ్చింది, వ్యాపారాలు ఎక్కడ చేశాడు? తెలియక మాట్లాడితే బాధ అనిపించదు, తెలిసీ తెలియనట్లు మాట్లాడితేనే బాధ అనిపిస్తుంది. దాదాపు 22 నెలల నుండి ఎంతో కక్షగట్టినట్లుగా, ఫ్యాక్షనిస్టుల కన్నా అన్యాయంగా విచారణ చేస్తూ వున్నాయి ఈడీ, ఐటి, ఆర్‌ఓసి, సీబీఐ. ఈనాడు, తోకపత్రికలు రాసినట్టుగా అందరినీ ఉసిగొల్పి ఈ ప్రభుత్వం వేరే పనే లేనట్టు జరుపుతున్న విచారణ ఇది. గత సంవత్సరకాలంగా ఆరు వందలకు పైగా అబద్ధపు, అసత్యపు లీక్‌లతో జరుగుతున్న విచారణ ఇది. 2000కు పైగా ఫోన్లు ట్యాప్ చేయించి జరుగుతున్న విచారణ ఇది. స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్దఎత్తున ఎవరిపైనా, దేనిపైనా ఇలా విచారణ చేసి ఉండరు. ఇంత చేసి ఏమి కనుక్కున్నారు అని నేను అడుగుతున్నాను. ఇంత చేసి ఏమి సాధించారు? విచారణ పేరుతో ప్రజాధనాన్ని నీళ్లలా వృధా చేశారు. రాజ్యాంగాన్ని వెక్కిరిస్తూ, ఒక మనిషి కనీస ప్రాథమిక హక్కులను హరించారు. రాష్ట్రంకోసం, దేశంకోసం ప్రాణం పోగొట్టుకున్న ఒక మహానేతకు జరగకూడని అన్యాయాన్ని జరిపించారు. రాష్ట్రంలో, దేశంలో అన్యాయాలు, అరాచకాలు పెట్రేగిపోతూ వుంటే, వేడుక చూస్తూ కూర్చున్న మీరా జగన్ గురించి, జగన్ వ్యాపారాల గురించి, వైయస్సార్‌సీపీ గురించి మాట్లాడేది,రాసేది? కాంగ్రెస్, టీడీపీ నాయకులకు, ఈ అబద్ధపు రాతలు రాసే పత్రికలకు జగన్ పేరెత్తే అర్హత లేదు. ప్రజలతో, ప్రజలకోసం, ప్రజలలో ఒకడిగా - ఒక కొడుకుగా, ఒక అన్నలా, ఒక తమ్మునిలా, ఒక మనవడిలా ఒక మాటకోసం కట్టుబడి- వాళ్ల ఇళ్లలో వుండి, వాళ్లు పెట్టిన అన్నం తిని, వాళ్ల బాధలు విని, వాళ్లకు ధైర్యం ఇచ్చి, వాళ్ల పక్షాన నిలబడి, పగలనక, రేయనక, ఎండనక, వాననక ప్రజలకోసం పోరాడిన జగన్ గురించి మాట్లాడే హక్కు ఈ ఏసీ రూమ్‌లలో ఉంటూ, వీడియో కెమెరాల ముందు విచక్షణ లేకుండా నోరు పారేసుకునే నాయకులకు లేదు. ఇచ్చిన మాటకోసం, పదవులు ఇస్తానన్నా వద్దని, ఇచ్చిన మాటను విడవకుండా, రెండు సంవత్సరాల నుండి విచారణ పేరుతో నరకయాతన పెడుతున్నా, చెదరని చిరునవ్వు, సడలని ఆత్మవిశ్వాసం - 13 నెలలుగా జైలు గోడలను సైతం లెక్కచేయకుండా, విశ్వసనీయతకు, విలువలకు పట్టం కట్టి నడుచుకుంటున్న జగన్ గురించి గాజుమేడల్లో కూర్చుని, తమ వీపు తమకు కనబడకుండా - అందరి మీద నీతులు వల్లిస్తూ వున్నవారికి అంతకన్నా జగన్ గురించి మాట్లాడే అర్హత లేదు. ప్రతీకారం చేసే దేవుడు త్వరలోనే ప్రకాశిస్తాడు. న్యాయం జరిగించే దేవుడు త్వరలోనే గర్విష్ఠులకు ప్రతిఫలం ఇస్తాడు. కఠోరమైన మాటలు మాట్లాడుతూ, ప్రజలను నలగ్గొట్టి, బాధించే వారి నుండి, జగన్‌ను, ప్రజలను మమ్ములను త్వరలోనే దేవుడు విడిపిస్తాడు. మా కుటుంబానికి, రాష్ట్రానికి, దేశానికి త్వరలోనే కష్టదినాలు పోగొట్టి నెమ్మది కలుగచేస్తాడు ఆ దేవుడు. ప్రజలు తిరగబడతారు. ఎవరూ ఊహించని విధంగా, దేశం మొత్తం మాట్లాడుకునే విధంగా గొప్పగా ప్రజలు ఆ తీర్పును ఇస్తారు. జగన్‌ను వాళ్లు బయటకు తెచ్చుకుంటారు. జగన్ చేత ఆ దేవుడు రచించే సువర్ణయుగాన్ని కూడా తప్పక చూస్తాం. - వైఎస్ భారతి, W/O వైఎస్ జగన్