వెలుగుల పండుగకు ఒక రోజు ముందే భారత క్రికెట్ అభిమానులు దీపావళి చేసుకున్నారు. మన బౌలింగ్ ‘బాంబు’ అదిరేలా పేలడంతో విశాఖలో కివీస్ ‘తుస్’మంది. మిశ్రా ‘మిస్సైల్’ దాడికి ఆ జట్టు తునాతునకలైంది. వన్డే సిరీస్ అంతటా ఆకట్టుకున్న న్యూజిలాండ్ బ్యాటింగ్... అసలు సమయంలో పేలని టపాసులా తుస్‌మంది. ఎప్పటిలాగే సీజన్‌తో సంబంధం లేకుండా వెలుగులు విరజిమ్మే కోహ్లితో పాటు ‘దోసౌవాలా’ రోహిత్ తారాజువ్వలా ఉవ్వెత్తున ఎగిస్తే... చిన్నపాటి చిచ్చుబుడ్లలా ధోని, జాదవ్‌ల ఆట పండుగ వెలుగులు తెచ్చింది. మొత్తం మీద భారత జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో న్యూజిలాండ్‌ను చీకటిలోకి పంపుతూ సగర్వంగా సిరీస్‌ను చేజిక్కించుకుంది.