గాంధీనగర్: గుజరాత్‌లోని మాధవ్‌పూర్ గ్రామవాసులకు ఇటీవల ఓ భయానక అనుభవం ఎదురైంది. జనవాసాల్లోకి చేరిన ఓ భారీ సింహం.. స్థానికులకు చెమటలు పట్టించింది. గ్రామంలోని ఓ కూడలి వద్ద యువకులు బాతాకాని కొడుతుండగా.. ఓ ఇంట్లో చొరబడ్డ మృగరాజు ఉస్సేన్ బోల్ట్‌ను మైమరపించే వేగంతో వారివైపు దూసుకొచ్చింది. అప్పటికే ఆ ఇంట్లోనివారు సింహం వస్తుందర్రో..! అని కేకలు వేయడంతో చచ్చాంరా దేవుడో అనుకూంటూ యువకులు తలోదిక్కు పారిపోయేందుకు యత్నించారు.
అయితే, ఆ సింహం మాత్రం ఎవరిపైనా దాడి చేయకుండా.. తన దారిన తను వాయువేగంతో దూసుకెళ్లింది. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఏడు సెకన్ల పాటు ఉన్న ఈ సింహం వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత నంద ట్విటర్‌లో పోస్టు చేయడంతో వైరల్ అయింది. ‘గంటకు 80 కిలో మీటర్ల వేగంతో ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు.. ఆ ఉసేన్ బోల్ట్ కూడా తప్పించుకోవడం కష్టం. అలాంటిది మనోళ్లు ఎలా తప్పించుకున్నారో చూడండి అని ఆయన పేర్కొన్నారు.