ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన నాగార్జున నాయుడు (10వ తరగతి విద్యార్థి) ఆంజనేయస్వామి మాలను ధరించి స్వామిని దర్శించుకుని తిరిగి వెళుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.
గుత్తి (అనంతపురం) : ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన నాగార్జున నాయుడు (10వ తరగతి విద్యార్థి) ఆంజనేయస్వామి మాలను ధరించి స్వామిని దర్శించుకుని తిరిగి వెళుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. తిమ్మాపురం గ్రామానికి చెందిన వెంకట సుబ్బయ్య, వెంకట సురేంద్ర, నాగార్జున, చంద్రశేఖర్, రమణ తదితరులు 20 మంది ఆంజనేయస్వామి మాలను ధరించారు.ఈ నెల 21న జీప్‌లో కసాపురం బయలుదేరారు.
కసాపురంలో స్వామిని దర్శించుకుని తిరిగి మంగళవారం సొంత ఊరుకు వెళుతుండగా మార్గమధ్యంలోని గుత్తిలో నాగార్జున నాయుడుకు ఆయాసం ఎక్కువైంది.దీంతో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. నాగార్జున నాయుడు మృతి చెందిన విషయాన్ని తిమ్మాపురంలోని మృతుని తల్లిదండ్రులు గుర్రప్ప,నాగలక్ష్మమ్మలకు సమాచారమిచ్చారు.వారు హుటాహుటిన గుత్తికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తిమ్మాపురం తరలించారు.