104 సేవలకు డీజిల్ బ్రేక్
రాజాం రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో సంచార వైద్యసేవలు అందిస్తున్న 104 వాహనాలు సర్కారు నిర్లక్ష్యం వల్ల ఒక్కొక్కటి గా మూలన చేరుతున్నాయి. ఇప్పటికే ఈ విభాగంలో పని చేస్తున్న సిబ్బందికి మూడు నెలలుగా జీతాల్లేవు. తాజాగా డీజిల్ బిల్లులూ భారీగా పెండింగులో పడిపోవడంతో ఈ వాహనాలు నిలిచిపోతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభమైన 104 సేవలను జిల్లాలో 20 వాహనాలతో గ్రామీణ ప్రాంతాలకు అందిస్తున్నారు. కాగా డీజిల్ కొరతతో రాజాం నియోజకవర్గానికి చెందిన 2, శ్రీకాకుళానికి చెందిన 2, పాతపట్నం, సీతంపేటల్లో ఒక్కో వాహనం నిలిచిపోయాయి. రాజాం వాహనాలకు సంబంధించి గతంలో డీజిల్ బిల్లు రూ.20 వేలకు చేరగానే ప్రభుత్వం మంజూరు చేసేసేది. ప్రస్తుతం ఈ బకాయి రూ.70 వేలు దాటడంతో బంక్ యజమాని డీజిల్ ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో వాహనాలు ఆగిపోయింది.
ఇదే తరహాలో శ్రీకాకుళం వాహనాలు 15 రోజులుగానూ, సీతంపేట, పాతపట్నం వాహనాలు వారం రోజులుగానూ క్లస్టర్ ఆస్పత్రుల వద్ద నిలిచిపోయాయి. దీంతో ఈ వాహనాల ద్వారా సేవలు పొందుతున్న దీర్ఘకాలిక రోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కాగా 104 వాహనాల్లో పని చేస్తున్న సిబ్బందికి 3నెలలుగా జీతాల్లేవు. జిల్లాలో 120 మంది వరకు పని చేస్తుండగా ఆగస్టు నుంచి ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇక్కట్లుకు గురవుతున్నారు. దీనిపై 104 ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జె.సింహాచలం మాట్లాడుతూ ప్రభుత్వం 104 వాహన సేవలు పట్ల, ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోందని ఆరోపించారు. జిల్లా కలెక్టర్, డీఎంహెచ్‌వో తక్షణం స్పందించి డీజిల్, జీతాల బకాయిలు చెల్లించాలని ఆయన కోరారు.