విశాఖపట్టణం: విశాఖపట్టణం జిల్లా ఏజెన్సీ పరిధిలోని పెదబయలు మండలం పోయిపల్లి పంచాయతీ జర్సింగి గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం తేనెటీగల దాడిలో 13 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. గ్రామ సమీపంలో ఉన్న మామిడి చెట్టుపై 50కి పైగా తేనె పట్లు ఉన్నాయి. ప్రతి రోజూ పిల్లలు ఆ చెట్టు కింద ఆడుకుంటుంటారు. వారిలో ఒకరు శుక్రవారం తేనె పట్టుపై రాయి విసరడంతో ఒక్కసారిగా ఈగలు పిల్లలపై దాడి చేశాయి.
వారి అరుపులు విని గ్రామస్తులు అక్కడికి పరుగెత్తుకొచ్చారు. పిల్లల్ని తేనెటీగల దాడి నుంచి రక్షించే ప్రయత్నంలో వారు కూడా కొందరు గాయపడ్డారు. మొత్తం 13 మంది గాయపడగా వారిలో పిల్లలే ఎక్కువ మంది ఉన్నారు. పరిస్థితి విషయంగా ఉన్న ముగ్గురు బాలలను పాడేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు.