- డీఎంఓ ప్రసాదరావు
తుమ్మపాల: జిల్లాలో 136 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని జిల్లా మలేరియా అధికారి కె.వి.ఎస్. ప్రసాదరావు అన్నారు. మండలంలోని బవులవాడ పంచాయతీ దర్జీనగర్, తుమ్మపాల పీహెచ్‌సీని ఆయన గురువారం పరిశీలించారు. దర్జీనగర్‌లో రెండేళ్ల బాలుడు టి. మోహిత్‌కు డెంగ్యూ నిర్దారణ కావడంతో ఆయన పర్యటించారు.
గ్రామంలో నీటి నిల్వలున్న చోట దోమలు వ్యాప్తి చెందుతాయని, నిల్వలు ఉండకుండా జాగ్రత్త పడాలని గ్రామస్తులకు సూచించారు. దోమల మందును ఇంటింటా పిచికారి చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 17 వరకు 136 డెంగ్యూ కేసులు, 57 చికున్ గున్యా, 6,160 మలేరియా కేసులు నమోదయ్యాయని చెప్పారు. దీంతో అన్ని గ్రామాల్లో అవగాహన శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు.
డెంగ్యూ నివారణలో ఆరోగ్య శాఖ, పంచాయతీ అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించి ఇళ్లల్లోని గోళాలలో నీటిని ఎప్పటికప్పుడు పొడిగా ఉంచాలన్నారు. చిన్నపిల్లలు దోమకాటుకు గురికాకుండా పూర్తిస్థాయిలో దుస్తులను వేయించాలన్నారు. ఏఎంఓ పి. రామారావు, జిల్లా కోఆర్డినేటర్ ఎ.శ్రీనివాసరావు తుమ్మపాల పీహెచ్‌సీ వైద్యాధికారి ఐ. ఉదయ్‌కుమార్ పాల్గొన్నారు.
ఉగ్గినపాలెంలో ముగ్గురికి డెంగ్యూ
కశింకోట: మండలంలోని ఉగ్గినపాలెంలోనూ ముగ్గురికి డెంగ్యూ వ్యాధి సోకినట్లు నిర్థారణ అయింది. గాలి మంగ, కలగ కనకరత్నం, బుదిరెడ్డి రమణలకు వ్యాధి సోకినట్లు తాళ్లపాలెం పీహెచ్‌సీ వైద్యాధికారి లూసీ కార్డిలియా తెలిపారు. పది మంది రక్త నమూనాలు విశాఖ కేజీహెచ్‌కు పంపగా ఈ నివేదిక వచ్చిందన్నారు. వైద్య శిబిరంలో ముగ్గురికి, జి.భీమవరం శిబిరంలో పది మందికి జ్వరాలు ఉన్నట్లు తేలిందన్నారు. జ్వర తీవ్రత ఎక్కువగా ఉన్న పది మందికి పీహెచ్‌సీలో వైద్యమందించినట్టు తెలిపారు. గ్రామాల్లో పారిశుద్ధ్య లోపమే వ్యాధులకు కారణమన్నారు. అనకాపల్లి వంద పడకల ఆసుపత్రి వైద్యుడు రత్నకుమార్ జి.భీమవరంలో వైద్య సేవలందించారు.