
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో 3.6 కోట్ల మంది ఓటర్లుంటే.. అందులో 52 లక్షల 67 వేల 636 బోగస్ ఓట్లు ఉండడం దారుణమని విజయవాడ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. గతంలో కేవలం 0.5శాతం ఓట్లతో రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిందని, అలాంటిది ఇప్పుడు 15 శాతం నకిలీ ఓట్లు ఉంటే ఇక మిగిలిన ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ప్రచారాలెందుకు చేసుకోవాలని ఆయన మండిపడ్డారు.
రాజకీయాన్ని ఒక వ్యాపారంలా.. దొంగ ఓట్లను పెట్టుకొని అధికారంలోకి రావాలనుకోవడం సరికాదని హితువు పలికారు. ఏపీ, తెలంగాణాలో రెండు చోట్ల దొంగ ఓట్లను రాజకీయ నాయకులు సృష్టిస్తున్నారు. రకరకాల మార్గాల్లో ఓట్లు లేని వారు కూడా ఓటు వేస్తుండడం సిగ్గుచేటు. జనచైతన్య వేదిక సర్వే ద్వారా జిల్లాల వారీగా బోగస్ ఓట్లను గుర్తించి ఎన్నికల అధికారికి పంపించడంతోపాటు కోర్టులో పిల్ వేశామని ఉండవల్లి అన్నారు. కంప్యూటర్లు లేని యుగంలో అంటే చనిపోయిన, ఇళ్ళు మారిన వారి సమాచారం సరిగా ఉండేది కాదని, కానీ కంప్యూటర్, ఆన్‌లైన్ యుగంలో కూడా ఇలా జరగడం దారుణమన్నారు. ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ స్పందించకుంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం వాటిల్లుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment