నారాయణకు రూ. 474 కోట్లు ఎక్కడివి: ఉండవల్లి
రాష్ట్ర మంత్రి నారాయణ ఆస్తుల చిట్టాను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ బయట పెట్టారు. తనకు సొంతంగా రూ. 474 కోట్ల ఆస్తులు ఉన్నట్లు స్వయంగా నారాయణ ప్రకటించారని, ఆ డబ్బు ఎలా సంపాదించారో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. దొంగ సొమ్ము దాచుకోడానికి సింగపూర్ మంచి ప్రాంతమని, ప్రపంచంలో స్విట్జర్లాండ్ అందుకు మొదటి స్థానంలో ఉండగా సింగపూర్ నాలుగో స్థానంలో ఉందని చెప్పారు. అందుకే చంద్రబాబు పదే పదే సింగపూర్ వెళ్తున్నారా అని ప్రశ్నించారు. అవతలివాళ్ల వైపు ఒకవేలు చూపిస్తే, మనవైపు నాలుగువేళ్లు చూపిస్తాయన్న విషయం మర్చిపోకూడదని అన్నారు. తాను ప్రకటించిన రూ. 474 కోట్ల ఆస్తులు ఎక్కడినుంచి వచ్చాయో నారాయణ చెప్పాలని డిమాండ్ చేశారు. దానికి ముందుగా అకౌంటు చెప్పాలన్నారు. ముఖ్యమంత్రికి కుడి, ఎడమ చేతులు మీరేనని అంతా అంటారని, ఆ లెక్కన అమరావతి స్కాంకు కూడా సూత్రధారి నారాయణే అవుతారని ఉండవల్లి ఆరోపించారు.
పది పదిహేను రోజుల్లోగా నారాయణ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే తాను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుందని ఆయన అన్నారు. చట్టప్రకారం ఏదైనా విషయం తెలిసి అధికారులకు చెప్పకపోవడం కూడా శిక్షార్హమే అవుతుందన్నారు. పారదర్శకంగా ఉన్నట్లు చెబుతూ ఉంటారని, పార పట్టుకుని తిరగడమే పారదర్శకతా అని ప్రశ్నించారు. ఇక మఖ్యమంత్రి కూడా పదే పదే తాను నిప్పు అంటారని, మీరెంత నిప్పో రేవంత్ రెడ్డి డబ్బులు ఇస్తుంటే అంతా చూశారని ఎద్దేవా చేశారు. పోనీ అది రేవంత్ రెడ్డి కాదు, కేసీఆర్ ఎవరికో ఆ వేషం వేసి పంపారని చెబుతారేమో చెప్పాలన్నారు. ఈ రెండేళ్లలో పుష్కరాలు తప్ప ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మనం ఏదైనా శుభకార్యం ప్రారంభిస్తే 'నారాయణ' అంటూ ప్రారంభిస్తాం కాబట్టి, ఈ ఆస్తుల వివరాలు వెల్లడించడం కూడా నారాయణే మొదలుపెట్టాలని అన్నారు. ఇది ఆయనకు అశుభం కాకుండా చూసుకోవాలన్నారు. తప్పుడు మనుషులు నడిపే స్కూళ్లకు ఎవరూ పిల్లలను పంపరని, అందువల్ల ఆయన తన క్రెడిబులిటీని నిరూపించుకోవాలని చెప్పారు. ఏ వ్యాపారం చేసి ఇంత మొత్తం సంపాదించారో చెప్పాలన్నారు. తాను డాక్యుమెంట్ల ఆధారంగానే అన్నీ చెప్పానని.. మీ వ్యాపారాలేంటో, వాటికి ఆధారాలేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. సొసైటీలకు వేల కోట్ల నిధులు ఉండొచ్చు గానీ, ఆ సొసైటీలను నడిపేవారికి వేలకోట్లు ఉండటానికి వీలుండదని అన్నారు. వీళ్లంతా సొసైటీ డబ్బులను సొంత డబ్బులా వాడేసుకుంటున్నారని తెలిపారు. సొసైట చట్ట ప్రకారం లాభాపేక్ష లేకుండా విద్యాసంస్థలు నడపాలని తెలిపారు.
ఇక ఏపీ రాజధాని నిర్మాణం గురించి కూడా ఉండవల్లి తీవ్రంగా మండిపడ్డారు. అసలు ఏ నివేదిక ఆధారంగా అమరావతిలో రాజధాని కడుతున్నారని ప్రశ్నించారు. శివరామకృష్ణన్ కమిటీ ఏం నివేదిక ఇచ్చిందో చెప్పగలరా అని అడిగారు. కేంద్రంలో పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా పనిచేసిన అనుభవజ్ఞుడైన శివరామకృష్ణన్‌తో పాటు చాలామంది నిపుణులు ఆ కమిటీలో ఉన్నారన్నారు. కానీ దాన్ని కాదని చంద్రబాబు మాత్రం రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేయడం కోసం నారాయణ, జీఎంఆర్, బీవీ రాజు, గల్లా జయదేవ్, సుజనా చౌదరిలతో ఓ కమిటీ వేశారని అన్నారు. వీళ్లంతా కోట్ల కోట్ల రూపాయలున్న పెద్ద వ్యాపారవేత్తలని, అమరావతితో వ్యాపారం చేద్దామనే శివరామకృష్ణన్ కమిటీ కాదని ఈ కమిటీ వేశారని మండిపడ్డారు. చనిపోయేముందు శివరామకృష్ణన్ ఓ లేఖ రాశారని, అది ప్రముఖ జాతీయ పత్రికల్లో వచ్చిందని ఉండవల్లి తెలిపారు. చంద్రబాబు చేస్తున్న పనివల్ల కొత్తగా ఏర్పడే రాష్ట్రం నాశనం అయిపోయే ప్రమాదం ఉందని అందులో చెప్పారన్నారు. రాజధాని ఎక్కడ కట్టాలో స్పష్టంగా చెప్పకపోయినా.. ఎక్కడ కట్టకూడదో మాత్రం చెప్పారని గుర్తుచేశారు. కృష్ణా-గుంటూరు మధ్య అమరావతి వద్ద కట్టొద్దని స్పష్టంగా చెప్పినా, అక్కడే కడుతున్నారని, అదేంటని అడిగినందుకు తాను ఊసరవెల్లి అయిపోయానంటున్నారుని ఆవేదన వ్యక్తం చేశారు.