ఆ పోలీసులకు డ్రైవింగ్ లైసెన్స్లు లేవు
* జిల్లాలో 2,200 మంది పోలీసులకు డ్రైవింగ్ లైసెన్స్ లు లేవు
* ఉన్నతాధికారుల ఆదేశాలతో..లెసైన్సులకు క్యూ కట్టిన పోలీసులు
* ఎల్‌ఎల్‌ఆర్ ఆన్‌లైన్ పరీక్షకు 1003మంది హాజరు
* 509 మంది పాస్, 494 మంది ఫెయిల్
* విస్తుపోయిన ఆర్టీఏ అధికారులు
ఇన్నాళ్లూ వారు ఏ వాహనంలో తిరిగినా ఆపేవారే లేరు. ఒకవేళ ఆపినా 'పోలీస్' పేరు చెప్పి ఎంచక్కా షికార్లు కొట్టేయడం అలవాటైపోయింది. ఇప్పుడు హెల్మెట్ వాడకం, డ్రైవింగ్ లైసెన్సుల విషయంలో ఉన్నతాధికారులు ఆరా తీయడంతో అసలు విషయం బయటపడినట్టుంది. తమ సిబ్బందికే డ్రైవింగ్ లైసెన్సులు లేవని తెలిసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. పరువు పోతుందనుకున్నారో ఏమో.. వెంటనే లైసెన్సులు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఒక్కసారిగా చిత్తూరు జిల్లాలోని పోలీసులు లైసెన్సుల బాటపట్టారు.
తిరుపతి మంగళం:
జిల్లా వ్యాప్తంగా 2,200 మందికి పైగా పోలీసులకు డ్రైవింగ్ లైసెన్స్‌లు లేనట్టు ఆర్టీఏ అధికారులు గుర్తించారు. వారిలో ఆదివారం ఒక్క రోజులోనే 1003 మంది దరఖాస్తు పూర్తి చేసుకుని, ఆన్‌లైన్‌లో నిర్వహించే పరీక్షకు హాజరయ్యారు. అందులో తిరుపతి ఆర్టీఏ కార్యాలయంలో 352 మంది, శ్రీకాళహస్తిలో 89, పుత్తూరు 112, చిత్తూరు 212, మదనపల్లి 139, పీలేరు 80, పలమనేరు 19 మంది ఉన్నారు. వారికి నిర్వహించిన ఎల్‌ఎల్‌ఆర్ ఆన్‌లైన్ పరీక్షలో జిల్లా వ్యాప్తంగా 509 మంది పాస్ కాగా, 494 మంది ఫెయిల్ అయినట్టు డెప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ సీహెచ్ ప్రతాప్, తిరుపతి ఆర్టీవో వివేకానందరెడ్డి తెలిపారు.
దిలా ఉండగా లైసెన్స్‌లకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఇంత కాలం లైసెన్స్ అంటే ఏమిటో తమకు తెలియదన్నట్టుగా విధులు నిర్వర్తించి, నేడో రేపో పదవీ విరమణ పొందుతున్న పోలీసులే అధిక సంఖ్యలో ఉండడం గమనార్హం. గతంలో మునుపెన్నడూ లేనంతగా లైసెన్సుల కోసం ఒక్క సారిగా వేల సంఖ్యలో పోలీసులు దరఖాస్తులు చేసుకోవడంపై ఆర్టీఏ సిబ్బంది సైతం ఆశ్చర్యానికి గురయ్యారు.