అప్పుడప్పుడూ హడావుడి..
♦ ఆర్టీఏ.. పోలీసులు.. రెండు శాఖల్లోనూ కనిపించని చిత్తశుద్ధి..
♦ టూ వీలర్లకు హెల్మెట్లే శ్రీరామరక్ష..
♦ రోజురోజుకు పెరుగుతున్న టూ వీలర్ ప్రమాదమృతులు
అప్పుడప్పుడూ హడావుడి.. నెలకో.. ఆర్నెల్లకోసారి తనిఖీలు.. అప్పుడు కూడా లెసైన్స్, ఆర్సీ బుక్ అడుగుతారు.. కానీ.. రక్షణ కవచాలైన హెల్మెట్, పొల్యూషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్‌లకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వరు.. ఇదీ ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో పోలీసులు, ఆర్టీఏ అధికారుల తీరు.. దీంతో వాహనదారులు హెల్మెట్లు కొన్నా.. వాడటం లేదు. ఇటీవలి కాలంలో టూ వీలర్లు ఢీకొని, జారి కిందపడి మృత్యువాత పడుతున్న సంఘటనలు కోకొల్లలు.. ఇందులో కేవలం హెల్మెట్ లేని కారణంగానే 90 శాతం మృత్యు ఒడికి చేరుతున్నారని ఇటు పోలీసులు.. అటు ఆర్టీఏ అధికారులు పేర్కొంటున్నారు.
పరిగి: టూ వీలర్లకు హెల్మెట్లే శ్రీరామరక్ష అని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు 70 శాతం మంది హెల్మెట్లు కొనుగోలు చేస్తున్నా.. 10 శాతం మంది కూడా వాటిని వాడటం లేదు.. రోజురోజుకూ టూ వీలర్ ప్రమాదాలు పెరుగుతుండగా.. మరణాలు కూడా అదేస్థాయిలో ఉంటున్నాయి. అర్బన్ ప్రాంతంలో 50 శాతం వరకు హెల్మెట్లు వాడుతుండగా.. ఇటీవల తనిఖీలు పెరగటంతో 60 శాతం వాడకం పెరిగింది.
నిరంతరంగా అమలు చేయాలి..
టూ వీలర్లు ఖచ్చితంగా హెల్మెట్ వాడాలనే నిబంధనను పోలీసులు, ఆర్టీఏ అధికారులు నిరంతరం అమలు చేయాలి. ఓపక్క అవగాహన మరోపక్క తనిఖీలు ఏకకాలంలో జరగాలి. పోలీసులు, ఆర్టీఏ అధికారులతోపాటు స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు తదితర అన్ని స్థాయిల్లో ప్రచార కార్యక్రమాలు చేపట్టాలి.
ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు.
♦ మండలంలోని రాఘవాపూర్‌కు చెందిన ఓ రైతు తన బైకుపై పరిగికి వచ్చాడు. దారిలో ఎదురుగా వస్తున్న మరో బైకు ఢీకొట్టింది. దీంతో అతడు రోడ్డుపై పడిపోవటంతో తలకు బలమైన గాయాలై ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు.. హెల్మెట్ ఉండి ఉంటే అతనికి ప్రాణాపాయం తప్పేదని వైద్యులు పేర్కొన్నారు.
♦ నెలక్రితం మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలానికి చెందిన ఓ వ్యక్తి కూతురిని చూసేందుకు పరిగికి వస్తున్నాడు. సయ్యద్ మల్కాపూర్ గేట్ సమీపంలో ఎదురుగా వస్తున్న బైకును ఇతడి బైకును ఢీకొట్టింది. రెండు బైకులపై ఉన్న వారెవరూ హెల్మెట్ ధరించలేదు. ఇందులో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందారు.
♦ ఇటీవల పరిగి మండలం భర్కత్‌పల్లికి చెందిన యువకుడు ద్విచక్ర వాహనంపై పరిగి వస్తుండగా.. మరో వాహనం రాసుకుంటూ వెళ్లడంతో రోడ్డుపై పడిపోయాడు. తలకు బలమైన గాయాలై ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు.
ముందుగా అవగాహన..
హెల్మెట్లు వాడటం, లెసెన్సు కలిగి ఉండటం, ఇన్సూరెన్సు చేయించుకోవటం అనే అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తాం.. తర్వాత తనిఖీలు చేపడతాం.. అనంతరం కేసులు నమోదు చేస్తాం.. జరిమానాలు విధిస్తాం.. - ప్రసాద్, సీఐ, పరిగి