విజయనగరం మున్సిపాలిటీ : 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్ చార్జీల పెంపుదలపై ఆంధ్రప్రదేశ్ రెగ్యులేటరీ కమిషన్ ఆధ్వర్యంలో ఈ నెల 27న ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లు ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈ జి.చిరంజీవిరావు తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దాసన్నపేట విద్యుత్ భవనం ఆవరణలో ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలు తమ అభిప్రాయాలను నేరుగా రెగ్యులేటరీ కమిషన్‌కు వెల్లడించవచ్చని తెలిపారు.
ఇదిలా ఉండగా రాష్ట్రంలోని ఎలూరు, గుంటూరు, కర్నూలు, తిరుపతి కేంద్రాల్లో ఈ తరహా కార్యక్రమం చేపట్టనున్నామన్నారు. విజయనగరంలో మొట్ట మొదటిగా ప్రారంభిస్తామన్నారు. తొలిసారిగా జిల్లాలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సంబంధించి విద్యుత్ శాఖ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రెగ్యులేటరీ కమిషన్ రానున్న నేపథ్యంలో విద్యుత్ భవనం, పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. కార్యాలయ ఆవరణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.
27న విద్యుత్ చార్జీల పెంపుపై ప్రజాభిప్రాయసేకరణ
Published Sun, Feb 26 2017 11:24 PM | Last Updated on Wed, Sep 5 2018 1:46 PM
Advertisement
Advertisement