336వ రోజు పాదయాత్ర డైరీ | 336th day padayatra diary | Sakshi
Sakshi News home page

336వ రోజు పాదయాత్ర డైరీ

Published Thu, Jan 3 2019 3:57 AM | Last Updated on Thu, Jan 3 2019 8:14 AM

336th day padayatra diary - Sakshi

ఇప్పటివరకు నడిచిన దూరం: 3,593.6 కిలోమీటర్లు
336వ రోజు నడిచిన దూరం: 8.6 కిలోమీటర్లు
02–01–2019, బుధవారం
తురకశాసనం, శ్రీకాకుళం జిల్లా 

చావు కోసం ఎదురుచూస్తున్నామని చెబుతుంటే గుండె తరుక్కుపోయింది.. 
ఈ రోజు మందస, సోంపేట మండలాల్లో పాదయాత్ర సాగింది. ఉదయం బాలిగంకు చెందిన భారతీ, ప్రవీణ్‌ అనే దంపతులు కలిశారు. నాన్నగారి వల్ల వారి కుటుంబానికి జరిగిన ఎనలేని మేలును తలచుకుని కృతజ్ఞతలు చెప్పారు.  నాన్నగారి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం వల్ల సోదరి భారతీ అక్క డాక్టర్‌ అయ్యిందట. భారతీతో పాటు ఆమె అన్న కూడా ఇంజినీరింగ్‌ పూర్తిచేసి ఉద్యోగం చేస్తున్నారు. ప్రవీణ్‌కేమో నాన్నగారి హయాంలో రుణమాఫీ అయ్యింది.. ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. ఉచిత విద్యుత్‌ అందింది. వారింట్లో పాపకు ఒళ్లు కాలిపోతే నాన్నగారి ఆరోగ్యశ్రీ పుణ్యమాని ఉచితంగా ప్లాస్టిక్‌ సర్జరీ ఆపరేషన్‌ జరిగిందని చెప్పారు. మీ నాన్నగారే లేకుంటే ఓ సామాన్య రైతు కుటుంబానికి చెందిన మాకు ఇవన్నీ సాధ్యమయ్యేవా? అంటూ ఆ దంపతులు ఉద్వేగానికి గురయ్యారు. వాళ్లను చూసి చాలా సంతోషమేసింది. నాన్నగారిలా జనం గుండెల్లో నిలిచిపోవడం కన్నా అదృష్టం ఏముంటుంది? మనిషి జన్మకు ఇంతకంటే సార్థకత ఏముంటుంది? 

ఈ రోజు కూడా ప్రతి చోటా కిడ్నీ బాధితులు కలుస్తూనే ఉన్నారు. లోహరిబంద పంచాయతీ నుంచి చాలామంది కిడ్నీ బాధితులు వచ్చి కలిశారు. ఆ పంచాయతీలోనే వందల సంఖ్యలో కిడ్నీ వ్యాధిగ్రస్తులున్నారట. విషాదమేంటంటే.. ఈ మధ్యనే పదుల సంఖ్యలో కిడ్నీ వ్యాధులతో మరణించారట. ప్రజలిలా పిట్టల్లా రాలిపోతున్నా.. అధికార పార్టీ నేతలకు చీమకుట్టినట్లయినా లేకపోవడం అత్యంత బాధాకరం. ఆ గ్రామమంతా యాదవులు, మత్స్యకార సోదరులే. కిడ్నీ రోగాల బారినపడి ఓ వైపు భూములు అమ్ముకుంటూ, మరో వైపు అప్పులు చేస్తున్నారు. పింఛన్లు రావడం లేదు.

మందులివ్వడం లేదు. ఆస్పత్రికి వెళ్తే వైద్యులు అందుబాటులో ఉండటం లేదు. బస్‌ పాసుల్లేవు. డయాలసిస్‌కు వెళ్తే నెల రోజులు ఆగమంటున్నారు. విధిలేక ప్రయివేటు ఆస్పత్రుల బాట పడుతున్నారు. అదీ లేనివాళ్లు.. చావుకోసం ఎదురుచూస్తున్నామని చెబుతుంటే గుండె తరుక్కుపోయింది. ఇంత దారుణ బాధలు అనుభవిస్తున్న ఆ పంచాయతీ ప్రజలకు సరిగా మంచినీరు కూడా సరఫరా చేయడం లేదట. రక్షిత మంచినీటి పథకంలో కూడా బురదనీరే వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యమే.

గౌడగొరంటి నుంచి ఒక కౌలు రైతు కొడుకు రమేష్‌చౌదరి వచ్చి కలిశాడు. నాలుగేళ్ల కిందట కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ చేయించుకున్నాడట. ఆరోగ్యశ్రీ వర్తించక, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయమూ అందక.. ఉన్న కొద్దిపాటి ఆస్తులు అమ్ముకున్నాడు. అదీ సరిపోక లక్షల్లో అప్పు చేశాడు. నెలనెలా వడ్డీలకు రూ.10 వేలు, మందులకు రూ.15 వేలు అవుతున్నాయని కన్నీరు పెట్టాడు. ఓ సాధారణ కౌలు రైతు కుటుంబానికి నెలకు పాతిక వేలు ఖర్చన్నది తలకు మించిన భారం కాదా? 

ప్రజా సంకల్ప యాత్రలో చిట్టచివరి నియోజకవర్గమైన ఇచ్ఛాపురంలోకి అడుగుపెట్టాను

ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న.. మీరు రూ.500 కోట్లకు పైగా బిల్లులు చెల్లించకపోవడంతో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి. మీ విలాసాలకు, విదేశీయానాలకు, ప్రజలను మభ్యపెట్టడానికి చేస్తున్న ధర్మపోరాట దీక్షలకు, తుపాను పరిహారం పేరిట మీరిచ్చిన చెల్లని చెక్కుల పంపిణీ ప్రచార కార్యక్రమాలకు వందల కోట్ల ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు పెడుతున్న మీరు.. పేదల ప్రాణాలను రక్షించే పథకాలకు మాత్రం నిధు లివ్వకపోవడం మానవత్వమేనా? 
- వైఎస్‌ జగన్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement