వేగంగా వెళ్తున్న వాల్వో బస్సు ముందు వెళ్తున్న ఆటోను ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో వెనుక నుంచి ఢీకొట్టింది.
కర్నూలు : వేగంగా వెళ్తున్న వోల్వో బస్సు ముందు వైపు వెళ్తోన్న ఆటోను ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం పోతుదొడ్డి గ్రామ సమీపంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తోన్న వోల్వో బస్సు.. గుంతకల్ మండలం వైటీచెరువు నుంచి కర్నూలుకు చేపల లోడుతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న గుంతకల్, గుత్తి, డోన్ ప్రాంతాలకు చెందిన ఎనిమిది మంది చేపల వ్యాపారులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని 108 సాయంతో క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.