తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బీఈడీ కళాశాలల ప్రవేశానికి గురువారం నిర్వహించిన ఎడ్‌సెట్-2015 ప్రశాంతంగా జరిగింది. ఈ ప్రవేశ పరీక్షకు 83.4 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగిన ఈ పరీక్షను 21,286 మంది రాశారు. రాష్ట్రంలోని 31 పట్టణాల్లో 59 పరీక్ష కేంద్రాల్లో ప్రవేశపరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 25,539 మంది దరఖాస్తు చేశారు. వీరిలో 4,253 మంది గైర్హాజరయ్యారు. మ్యాథమేటిక్స్‌కు 6,247 మంది దరఖాస్తు చేయగా 5,021 మంది హాజరయ్యారు. ఫిజికల్ సైన్స్‌కు 2,532గాను 2,094 మంది, బయాలజీ సైన్స్‌కు 5,086గాను 4,237 మంది, సోషల్ స్టడీస్‌కు 11,062గాను 9,420 మంది హాజరయ్యారు. ఇంగ్లిషుకు 612 మంది దరఖాస్తు చేస్తే 514 మంది హాజరయ్యారు.
పరీక్ష కేంద్రాల తనిఖీ
తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, ఎస్వీ జూనియర్ కళాశాల, ఎస్వీయూ క్యాంపస్ స్కూల్‌లోని పరీక్ష కేంద్రాలను ఎడ్‌సెట్ చైర్మన్, ఎస్వీయూ వీసీ డబ్ల్యు రాజేంద్ర, కన్వీనర్ కుమారస్వామి, ఎస్వీయూ రిజిస్ట్రార్ ఎం.దేవరాజులు, రీజినల్ కోఆర్డినేటర్ చెండ్రాయుడు, సిటీ కోఆర్డినేటర్ ఎం.సుబ్రమణ్యం తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణను పరిశీలించారు.
12న ఫలితాలు: ఎడ్‌సెట్-2015 ఫలితాలను జూన్ 12న విడుదల చేయనున్నట్టు కన్వీనర్ టీ కుమారస్వామి తెలిపారు.
ఎడ్‌సెట్‌కు 83 శాతం హాజరు
Published Thu, May 28 2015 8:02 PM | Last Updated on Sun, Sep 3 2017 2:50 AM
Advertisement