వ్యవసాయ అవసరాల కోసం ప్రస్తుత పరిస్థితుల్లో 7 గంటలపాటే విద్యుత్ ఇస్తామని ప్రభుత్వం శాసనమండలిలో ప్రకటించిన 24 గంటలు గడవకముందే..
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ అవసరాల కోసం ప్రస్తుత పరిస్థితుల్లో 7 గంటలపాటే విద్యుత్ ఇస్తామని ప్రభుత్వం శాసనమండలిలో ప్రకటించిన 24 గంటలు గడవకముందే అక్టోబర్ 2 నుంచి రైతులకు 9 గంటల పాటు విద్యుత్ ఇస్తామని శుక్రవారం శాసనసభలో వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. వ్యవసాయ పద్దుపై జరిగిన చర్చకు మంత్రి సమాధానమిచ్చారు. వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఇకపై భూములకూ హెల్త్‌కార్డులు ఇస్తామని, పేదలకు ఉచితంగా వైద్యం అందించినట్టే భూములకు ఇచ్చే హెల్త్‌కార్డుల ద్వారా రైతులకు మేలు జరుగుతుందన్నారు.
ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్లు.. : కేఈ
ఇకపై.. భూములను ఎక్కడి నుంచైనా రిజిస్టర్ చేయించుకునేలా చర్యలు చేపట్టినట్టు రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి చెప్పారు. దీనికోసం వెబ్‌ల్యాండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రిజిస్ట్రేషన్ శాఖకు, రెవెన్యూ శాఖకు మధ్య అనుసంధానం చేసి, రిజిస్ట్రేషన్ చేసిన 10 నిముషాల్లో రెవెన్యూ శాఖకు వివరాలు తెలిపే విధంగా చేస్తామన్నారు. రెవెన్యూ శాఖ పద్దుపై ఆయన సభ్యుల ప్రశ్నలకు సభలో సమాధానమిచ్చారు.