
స్వైన్ ఫ్లూ పరీక్షలకు విశాఖలో ల్యాబ్
రాజమండ్రి: రాష్ట్రంలోని 13 జిల్లాలకూ సేవలందించేవిధంగా స్వైన్ ఫ్లూ పరీక్షల కోసం విశాఖలో త్వరలో మెడికల్ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్టు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. పుష్కరాల ఏర్పాట్లపై ముఖ్య కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యంతో కలిసి ఆయన ఉభయ గోదావరి జిల్లాల అధికారులతో రాజమండ్రిలో మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ...రాష్ర్టంలో ఇప్పటివరకూ తొమ్మిది స్వైన్‌ఫ్లూ మరణాలను గుర్తించామన్నారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు 13 జిల్లాల్లోనూ 13 మంది నోడల్ అధికారులను నియమించామన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు వైద్య కళాశాలలకు అనుమతులు ఇస్తున్నట్టు మంత్రి తెలిపారు. విశాఖలో రెండు, తిరుపతి, శ్రీకాకుళంలో ఒక్కొక్కటి చొప్పున ఇప్పటికే అనుమతులు ఇచ్చామన్నారు.
గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో మెరుగైన వైద్య సేవలు ప్రారంభించామన్నారు. ఎవరైనా ఆసక్తి చూపితే రాజమండ్రి వంటి ప్రాంతాల్లో కూడా దీనిని అమలు చేస్తామన్నారు. ఆరు వేల నర్సుల పోస్టుల భర్తీ వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలో 6 వేల స్టాఫ్‌నర్సుల పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఏటా రెండు వేల చొప్పున పోస్టులు భర్తీ చేస్తామన్నారు. రాజమండ్రి, మచిలీపట్నం, పొద్దుటూరు, నంద్యాల తదితర పది ఆస్పత్రుల్లో డిప్లమో ఇన్ నేషనల్ బోర్డు(డీఎన్‌బీ) కోర్సు ప్రారంభిస్తామని, తద్వారా నిపుణుల కొరతను తీర్చేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. సమావేశంలో కలెక్టర్ హెచ్. అరుణ్‌కుమార్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సావిత్రమ్మ తదితరులు పాల్గొన్నారు.