‘అభయ’ కేసులో నిందితులకు 20 ఏళ్ల జైలు | 'Abhaya' case court to The accused to 20 years in prison | Sakshi
Sakshi News home page

‘అభయ’ కేసులో నిందితులకు 20 ఏళ్ల జైలు

Published Thu, May 15 2014 12:57 AM | Last Updated on Sat, Jul 28 2018 8:40 PM

‘అభయ’ కేసులో నిందితులకు 20 ఏళ్ల జైలు - Sakshi

‘అభయ’ కేసులో నిందితులకు 20 ఏళ్ల జైలు

సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి తీర్పు.. కేసు నమోదైన 209 రోజుల్లోనే వెలువడిన తీర్పు..
 
 
రంగారెడ్డి జిల్లా,  హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ‘అభయ’పై అత్యాచారం కేసులో దోషులకు న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. అభయను కిడ్నాప్ చేసి సామూహికంగా అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నిందితులు సతీష్, వెంకటేశ్వర్లుకు 20 ఏళ్ల చొప్పున జైలుశిక్ష విధిస్తూ సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి బుధవారం తీర్పు చెప్పారు. అంతేగాక నిందితులకు రూ.2వేల చొప్పున జరిమానా విధించారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగరాజు కథనం ప్రకారం.. బెంగళూరుకు చెందిన అభయ(22) గచ్చిబౌలి గౌలిదొడ్డిలోని మహి ళా హాస్టల్‌లో ఉంటూ హైటెక్‌సిటీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. 2013 అక్టోబర్ 18న ఆఫీస్‌లో విధులు ముగించుకుని హాస్టల్‌కు వెళ్లేందుకు క్యాబ్(ఏపీ09టీవీ ఏ 2762) ఎక్కింది. డ్రైవర్ సతీష్‌తోపాటు అతని స్నేహితుడు వెంకటేశ్వర్లు కలిసి కారును దారిమళ్లించి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా, కేసు నమోదైన 209 రోజుల్లోనే తీర్పురావడం విశేషం. అంతేగాక నిర్భయ చట్టం కింద ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన మొట్టమొదటి కేసు ఇదే కావడం మరో విశేషం.

తొలిసారిగా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అమెరికాలో ఉన్న సాక్షిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి విచారిం చారు. ఈ కేసులో 42 మంది సాక్షులను నమోదు చేయగా 21 మందిని విచారించారు. కేసును ప్రాసిక్యూషన్ సాక్ష్యాధారాలతో నిరూపించడంతో భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 366, 342, 376-డీతోపాటు క్రిమినల్ లా (సవరణ) చట్టం-2013 ప్రకారం నిందితులకు 20 ఏళ్ల జైలుశిక్ష లేదా జీవితఖైదు విధించవచ్చని న్యాయమూర్తి నాగార్జున్ తెలిపారు. అయితే నిందితులు సతీష్, వెంకటేశ్వర్లు.. తమకు భార్యాపిల్లలతోపాటు వృద్ధ తల్లిదండ్రులున్నారని, కుటుంబాన్ని పోషించే బాధ్యత తమపైనే ఉన్నదని విన్నవించారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇద్దరు నిందితులకు 20 ఏళ్ల చొప్పున జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.    
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement