హత్య కేసు దర్యాప్తునకు పైస్థాయిలో బ్రేక్‌లు
- శ్రీశైలవాసు హత్య కేసులో నిందితులను పట్టుకోవడంలో పోలీసుల వైఫల్యం
- అనుమానాలకు తావిస్తున్న గాలింపు చర్యల తీరు
నందిగామ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొగ్గవరపు శ్రీశైలవాసు హత్య కేసులో నిందితులను పట్టుకునే విషయంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హత్య జరిగి నాలుగు రోజులు అవుతున్నా నేటికీ నిందితుల ఆచూకీని పోలీసులు గుర్తించలేకపోయారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నా నిందితుల ఆచూకీ తెలుసుకోలేకపోవటం అనుమానాలకు తావిస్తోంది. హంతకులు హత్య అనంతరం పారిపోయేందుకు ద్విచక్ర వాహనాన్ని ఉపయోగించారని ప్రత్యక్ష సాక్షులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆ వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకోలేకపోయారు. శ్రీశైలవాసు అనుచరులతోపాటు పలువురిని విచారించినప్పటికీ హంతకుల ఆచూకీ కనుగొనలేకపోయారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులను సరిగా అంచనా వేయటంలో పోలీస్ వర్గాలు విఫలమయ్యారనే ఆరోపణలున్నాయి. మృతుడు సాత్వికుడు, అతనికి ఎవరూ శత్రువులు లేరు.. అనే కోణంలోనే పోలీసులు విచారణ జరుపుతున్నారు తప్ప కుటుంబ సభ్యుల వద్ద నుండి సరైన సమాచారాన్ని పోలీస్ వర్గాలు పొందలేకపోయాయి.
ఈ హత్య వెనుక బలమైన కుట్ర ఉందని కుటుంబ సభ్యులు, వైఎస్సార్ సీపీ ప్రముఖ నాయకులు ఆరోపిస్తున్నారు. కోటి రూపాయల మేర ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వివాదం నేపథ్యంలో ఈ హత్య జరిగిందని స్వయానా జిల్లా ఎస్పీనే ఘటన జరిగిన రెండు గంటల్లోపే ప్రకటించడం అనుమానాలకు తావిస్తోంది. రూ. కోటి అప్పున వ్యక్తి ఒక మనిషిని చంపుతాడనేది సరైన వాదన కాదంటున్నారు. హత్యకు కుట్ర పన్నిన హనుమంతరావుకు కిరాయి హంతకుడిని పెట్టి లక్షలాది రూపాయలు చెల్లించే ఆర్థిక స్తోమత లేదనేది పలువురి అభిప్రాయం. ఇదే విషయాన్ని పలు దఫాలుగా పోలీ సుల దృష్టికి వైఎస్సార్ సీపీ నాయకులు తీసుకెళ్లినట్లు పేర్కొంటున్నారు.
రాజకీయ ఒత్తిళ్లే కారణమా..?
కేసు పురోగతి సాధించలేకపోవటానికి ఉన్నత స్థాయి అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే అనుమానాలు కూడా లేకపోలేదు. శ్రీశైలవాసుకు ఈ ప్రాంతంలో తన సామాజికవర్గంపై గట్టిపట్టు ఉంది. నందిగామలో ప్రాంతంలో బలమైన నాయకుడు హత్యకు గురైతే నిందితులను గుర్తించకపోవటం పోలీసుల వైఫల్యంగానే ప్రజలు భావిస్తున్నారు. కేసు దర్యాప్తు పురోగతి గురించి నందిగామ ఇన్‌స్పెక్టర్ భాస్కరరావును వివరణ కోరగా, నిందితుల ఆచూకీ ఇంతవరకు దొరకలేదన్నా రు. ఇతర దేశాలకు పారిపోకుండా పాస్‌పోర్టును నిలుపుదల చేయించామని, కోర్టు ద్వారా వారెంట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.