సంచలనం రేకెత్తించిన మహిళపై యాసిడ్ దాడి కేసులో ఎట్టకేలకు చిక్కుముడి వీడింది. ఆమె జీవనశైలే దాడికి కారణమని పోలీసుల విచారణలో వెల్లడైంది.
నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్: సంచలనం రేకెత్తించిన మహిళపై యాసిడ్ దాడి కేసులో ఎట్టకేలకు చిక్కుముడి వీడింది. ఆమె జీవనశైలే దాడికి కారణమని పోలీసుల విచారణలో వెల్లడైంది. యాసిడ్ దాడిని సభ్యసమాజం ముక్తకంఠంతో ఖండిం చింది. అయితే కేసు విచారణలో నమ్మలేని నిజాలు వెలుగుజూశాయి. వివిధ కోణాల్లో విచారణ చేపట్టిన మూడో నగర పోలీసులు చివరకు దాడికి సూత్రధారైన నెల్లూరులోని ఎస్వీఆర్ స్కూలు కరస్పాండెంట్ అందె శ్రీనివాసరావుతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.
ఘటనకు సంబంధించిన వివరాలను సిటీ డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పోలీసు అధికారులు వెల్లడించారు. వరికుంటపాడు మండలానికి చెందిన చీమలదిన్నె లక్ష్మీచెన్నమ్మకు నెల్లూరులోని జాకీర్‌హుస్సేన్‌నగర్‌కు చెందిన నాగేంద్రబాబుతో పదేళ్ల కిందట వివాహమైంది. మూడేళ్ల కిందట శ్రీనివాసనగర్‌లోని ఎస్‌వీఆర్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో ఆమె ఆయాగా, నాగేంద్ర బస్సు క్లీనర్‌గా పనికి చేరారు. ఈ క్రమంలో స్కూలు కరస్పాండెంట్ అందె శ్రీనివాసరావుతో లక్ష్మీచెన్నమ్మ సన్నిహితంగా మెలిగేది. మరోవైపు అదే సమయంలో తమ ఇంటి వద్ద ఉన్న పెయింటర్ విజయకుమార్‌తోనూ చనువుగా
ఉండేది. ఈ విషయం విజయకుమార్ ఇంట్లో పెద్దదుమారం రేపడంతో ఆమె అక్కడ నుంచి నివాసాన్ని మరో ప్రాంతానికి మార్చేసింది. ఆరు నెలల కిందట భర్త అనారోగ్యంతో చనిపోవడంతో కిసాన్‌నగర్‌లోని తల్లిదండ్రుల వద్దకు చేరింది. అనంతరం ట్రంకురోడ్డులోని ఓ వస్త్రదుకాణంలో చేరి, కొద్ది రోజుల్లోనే యాసిడ్ దాడికి గురైంది.
అంద విహీనం చేయాలని ప్లాన్
లక్ష్మీచెన్నమ్మను తాను బాగా చూసుకుంటున్నా.. ఇతరులతో సన్నిహితంగా మెలుగుతూ తనను నిర్లక్ష్యం చేస్తోందని ఎస్‌వీఆర్ స్కూలు కరస్పాండెంట్ అందె శ్రీనివాసరావు భావించాడు. ఆమెను ఎలాగైనా దెబ్బకొట్టాలని ఆలోచించసాగాడు. ఈ క్రమంలోనే స్కూలుకు రంగులు వేయాలని పెయింటర్ విజయకుమార్‌కు కబురుపంపాడు. ఆయన తన పెద్దకుమారుడు జీవన్‌తో పాటు చిన్నకుమారుడి(మైనర్)ని పెయింట్ వేసేందుకు పంపాడు. వీళ్లిద్దరూ గతంలో ఇదే స్కూలు విద్యార్థులు. పెయింట్ వేసేందుకు వచ్చిన జీవన్‌తో లక్ష్మీచెన్నమ్మ వ్యవహారాన్ని శ్రీనివాసరావు చర్చించాడు.
వారిని మాటలతో రెచ్చగొట్టాడు. గతంలో తమ కుటుంబంలో గొడవలకు కారణమైన లక్ష్మీచెన్నమ్మపై అప్పటికే కోపంతో ఉన్న జీవన్‌లో ఆయన మాటలు పగను పెంచాయి. వీరి బలహీనతను అసరాగా చేసుకున్న శ్రీనివాసరావు యాసిడ్ దాడికి పథక రచన చేశారు. అందంతో ఉన్నాననే భావనతోనే ఆమె అలా వ్యవహరిస్తోందని యాసిడ్ పోసి అందవిహీనం చేయాలని ప్లాన్ వేశారు. మే 27వ తేదీ రాత్రి షాపు నుంచి వస్తున్న లక్ష్మీచెన్నమ్మను జీవన్ తన సోదరుడితో కలిసి బైక్‌పై వెంబడించారు. అనంతరం ఆటోస్టాండ్ వద్దకు చేరుకుంటుండగా ఆమెపై యాసిడ్ దాడిచేసి పరారయ్యారు.
చిక్కుముడి వీడిందిలా...
వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అసలు విషయం అంతుచిక్కక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గతంలో ఆమెతో సన్నిహితంగా ఉన్న.. ఆమెతో విబేధించిన వ్యక్తులను విచారించారు. ఈక్రమంలోనే అందె శ్రీనివాసరావును అదుపులోకి తీసుకొని విచారించగా మొదట తనకేమి తెలియదని బుకాయించాడు. చివరకు తమదైన స్టైల్‌లో విచారించగా అసలు విషయం బయటపెట్టాడు. దీంతో శ్రీనివాసరావు, జీవన్‌తో పాటు బాలుడిని అరెస్ట్ చేసి బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.
సిబ్బందికి అభినందన
కేసును త్వరితగతిన ఛేదించిన మూడోనగర ఇన్‌స్పెక్టర్ కె.వి రత్నం, హెడ్‌కానిస్టేబుళ్లు జి. ప్రభాకర్‌రావు, బి.వి నరసయ్య, ఈ. రాంబాబు, కానిస్టేబుళ్లు ఎం. రమేష్‌బాబు, ఈ. వేణుగోపాల్, పి. ప్రతాప్, అజయ్‌ను ఉన్నతాధికారులు అభినందించి రివార్డులు ప్రకటించారు. సమావేశంలో ఏఎస్పీ రెడ్డి గంగాధర్‌రావు, సిటీ డీఎస్పీ పి. వెంకటనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.