ఎన్నో ఆశలు.. | AgriGold customers told to take part in verification | Sakshi
Sakshi News home page

ఎన్నో ఆశలు..

Published Sun, Oct 15 2017 10:47 AM | Last Updated on Mon, May 28 2018 3:04 PM

AgriGold customers told to take part in verification - Sakshi


రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ వస్తే అన్ని ఖర్చులూ పోను మిగిలిన రెండు లక్షలు బ్యాంకులో వేద్దామనుకున్నంతలో ఎవరో ఒత్తిడి చేశారని అగ్రిగోల్డులో డిపాజిట్‌ చేసిన ఓ కుటుంబం ఇప్పటివరకూ కలవరపడుతూనే ఉంది.

కష్టపడి పనిచేసి... పైసా.. పైసా కూడబెట్టి పోగు చేసుకున్న సొమ్ము కాస్తా అందులో డిపాజిట్‌ చేసి ఇన్నాళ్లూ కన్నీటితో గడిపారు. ఇలాంటివారు జిల్లా వ్యాప్తంగా దాదాపు లక్షా 43వేల మంది కోట్లాదిరూపాయలు డిపాజిట్‌ చేశారు. సంస్థ బోర్డు తిప్పేయడంతో వీరందరిలోనూ అలజడి రేగింది.తమ కష్టం ఊరికే పోదనీ... చెమటోడ్చి కూడబెట్టినది వృథా కాదనీ... ఎప్పటికైనా తమకు న్యాయం జరగకపోతుందా... అని కళ్లల్లో ఒత్తులు వేసుకుని గడిపారు.

బొబ్బిలి:పిల్లల చదువుల కోసం... వారి పెళ్లిళ్లకోసం... వృద్ధాప్యంలో వైద్యం కోసం... రిటైర్‌ అయ్యాక కాసింత గూడు కట్టుకుందామనీ... ఇలా ఒక్కొక్కరూ ఒక్కో లక్ష్యంతో అగ్రిగోల్డ్‌ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. వారందరికీ శఠగోపం పెట్టి ఆ సంస్థ కాస్తా బోర్డు తిప్పేసింది. ఏళ్ల తరబడి పోరాడితే ఎట్టకేలకు సీఐడీ ద ర్యాప్తు చేపట్టి బాధితుల నుంచి ఆధారాలు సేకరించేందుకు జి ల్లాలోని పలు పోలీసు స్టేషన్ల వద్ద ఆన్‌లైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ కేంద్రాలకు బాధితులు క్యూ కడుతున్నారు. ఆయా ఆన్‌లైన్‌ కేంద్రాల వద్ద ఎవరి కష్టాలు వారు చెప్పుకుంటున్నారు. తామెంత పెట్టుబడులు ఏ విధంగా పెట్టి మోసపోయామన్నదీ తెలియజేసుకుని పరస్పరం ఓదార్చుకుంటున్నారు. తాము చెల్లించిన మొత్తానికి ఇచ్చిన రసీదులను, సొమ్ము డిపాజిట్‌ చేసినట్టు ఇచ్చిన బాండ్లనూ ఇన్నాళ్లూ చూసుకుంటూ గడిపినవాళ్లు కాస్తా తమ సొమ్ము తిరిగి వస్తుందన్న ఆశతో ఎక్కడి పనులక్కడ వదిలేసి కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు.

పెట్టుబడులు రూ. వెయ్యికోట్లకు పైమాటే...
జిల్లా వ్యాప్తంగా 1.43,030 మంది వివిధ రకాల పొదుపు ఖాతాలు, చీటీలు, పెట్టుబడుల విభాగాల్లో డబ్బు దాచుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇలా సుమారు వెయ్యి కోట్ల రూపాయల వరకూ పెట్టుబడి చేసినట్టు తెలుస్తోంది. ఇందులో సుమారు 25వేల మంది ఏజెంట్లే ఉన్నారు. కూలీ నాలీ చేసుకున్న వారి దగ్గర నుంచి ఆటో డ్రైవర్లు, రైతులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు, దినసరి కూలీలు ఇలా అన్ని రంగాలకు చెందిన వారూ ఉన్నారు. డబ్బుల కోసం తిరిగి తిరిగి కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూశారు. జిల్లా వ్యాప్తంగా 16 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వీరి కోసం రూ.5కోట్లు విడుదల చేసినా నేటికీ వారి కుటుంబాలకు ఆ డబ్బు అందలేదు. సుమారు మూడు నెలలుగా ఆయా కుటుంబాలు పరిహారం వస్తుందేమోనని ఎదురు చూస్తున్నాయి. చనిపోయిన వారికి  రూ.5లక్షల చొప్పున పరిహారంగా అందజేస్తామని కుటుంబాలను వీధిన పడకుండా చూస్తామని అసెంబ్లీలో ప్రకటించినా ఆయా కుటుంబాలకు ఎదురు చూపులే మిగిలాయి. ఎప్పుడో చనిపోయిన బాధితుల పోస్ట్‌మార్టం సర్టిఫికెట్, డెత్‌ సర్టిఫికెట్లు తెమ్మంటూ షరతులు విధిస్తున్నారు. వీటి వల్ల బాధిత కుటుంబాలు మరింత ఒత్తిడికి లోనవుతున్నాయి. ఇలా అడుగుతారని అప్పుడు మాకు తెలియదు కదా ఇప్పుడెలా తేగలమని వారు నిస్సహాయంగా ఎదురు తెన్నులు చూస్తున్నారు.

ఆశల మోసులు
అగ్రిగోల్డ్‌ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వారంతా ఇప్పుడు కాస్త ఆశతో ఉన్నారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులను కొనుగోలు చేసేందు కు ముందుకు వచ్చిన సంస్థ డిపాజిట్‌ చెల్లించడం, అప్పులను లెక్కించేందుకు సీబీఐ ఆధ్వర్యంలో పోలీసులు కూడా ఆన్‌లైన్‌ చే స్తుండటంతో బాధితుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం మరింత చొరవ చూపాలని కోరుకుంటున్నారు.

ఆన్‌లైన్‌ మొరాయించినప్పుడల్లా నిరాశ
అగ్రిగోల్డ్‌ కంపెనీ బాధితుల బాండ్ల గుర్తింపు, రసీదుల లెక్కిం పు వంటి కార్యక్రమాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. జిల్లాలోని దాదాపు అన్ని పోలీసుస్టేషన్లు, వివిధ కేంద్రాల వద్ద ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక్కో సారి ఆన్‌లైన్‌ మొరాయిస్తున్నప్పుడు బాధితులు నిరాశ చెందుతున్నారు. అప్పటికప్పుడే మళ్లీ పనిచేస్తుందంటూ సమాచారం వస్తుండటంతో ఊరట చెందుతున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం ఎంత తొందరగా తేల్చేస్తే బాగుండునన్న భావన బాధితుల్లో కనిపిస్తోంది.

వీటి సంగతేంటి?
అగ్రిగోల్డ్‌ బాధితుల బాండ్లను, రసీదులను నమోదు చేస్తున్న యంత్రాంగం కొన్నింటిపై స్పష్టత లేదని వదిలేస్తోంది. కంపెనీ ఇచ్చిన బాండ్లు మెచ్యూరిటీకి వచ్చినవి రెండు నెలల ముందుగా తీసుకుంటారు. వాటికి జిరాక్స్‌ కాపీలిచ్చి స్టాంప్‌ వేసి కస్టమర్లకు ఇస్తారు. అయితే ఇప్పుడవి ఆన్‌లైన్లో నమోదు చేయడం లేదు. ఇటువంటివి బ్రాంచ్‌కు నెలకు రూ.కోటి వరకూ ఉంటాయి. జిల్లాలో ఆరు బ్రాంచిలున్నాయి. ఈ ఆరు బ్రాంచిల్లో కలిపి 2014 నవంబర్, డిసెంబర్‌ నెలల్లో కంపెనీ తీసుకున్న మెచ్యూరిటీ బాండ్ల విలువ రూ.12 కోట్లు ఉంటుంది. దీనికి సంబం ధించి 5వేల మంది బాధితులున్నారని వాటిని నమోదు చే యడం లేదని ఏజెంట్లు వాపోతున్నారు. అలాగే మెంటాడ తదితర ప్రాంతాల్లో కంపెనీ పేరిట వెంచర్లు వేసి క్యాంపులు నిర్వహించారు. ఆ క్యాంపుల్లో గజం వెయ్యి రూపాయల చొప్పున వందల్లో ప్లాట్లు విక్రయించేందుకు కొనుగోలు దారుల నుంచి రూ.50వేలు, లక్ష చొప్పున  అడ్వాన్సులు తీసుకున్నారు. వాటికి రసీదులు ఉన్నాయి. కానీ వాటిని నమోదు చేయడం లేదు. వీటితో పాటు కంపెనీ మూత పడేముందు సాధారణ పెట్టుబడులకు కూడా నవంబర్, డిసెంబర్‌ నెలల్లో రసీదులు ఇవ్వలేదు. ఏజెంట్ల వద్ద మంత్లీ, డైలీ స్టేట్‌మెంట్లు ఉన్నాయి. వీటిని కూడా నమోదు చేయడం లేదు. వీటి విలువ జిల్లాలో సుమారు రూ.10 కోట్లు ఉండొచ్చని ఏజెంట్లు చెబుతున్నారు.

నమ్మకమైతే ఉంది. ఏమవుతుందో చూడాలి:
కంపెనీ ఇప్పటికే పలుమార్లు ఇటువంటి వివరాల సేకరణ చేసింది. అయితే ఇప్పుడు ప్రభుత్వ పరంగా చేస్తుండటంతో నమ్మకం కుదిరింది. బాధితులంతా ఆశలు పెంచుకుంటున్నారు. కానీ దీనికి సమయం ఎక్కువ పడుతుంది. ఎన్నికలు సమీపించేసరికి ఎలా మారుతుందో చూడాలి. పోలీసు స్టేషన్లకు పెద్ద ఎత్తున వస్తున్నారు. వారి బాధలు వర్ణనాతీతం, మా ఉద్యమ ఫలితంగానే కదలిక వచ్చింది. రోజూ రెండు మూడు పోలీసు స్టేషన్లు తిరుగుతున్నాం.
– పి కామేశ్వరరావు, జిల్లా గౌరవాధ్యక్షుడు,

అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ అసోసియేషన్‌.  
కొన్నింటికే పరిమితం చేస్తున్నారు
జిల్లాలో చేపడుతున్న ఆన్‌లైన్‌ ప్రక్రియలో మెచ్యూరిటీ బాండ్లు, రియ ల్‌ వెంచర్లు, రసీదులివ్వని చెల్లింపులకు సంబంధించి ఆధారాలున్నా నమోదు చేయడం లేదు. సంబం ధిత స్టేట్‌మెంట్లు,మెచ్యూరిటీ బాం డ్ల జిరాక్స్‌లు, రసీదులు చూపిస్తున్నా పట్టించుకోవడం లేదు. వాటి విలువ కోట్లలో ఉంటుంది. ఆయా బాధితులు  మాకో న్యాయం, మిగతా వారికో న్యాయ మా అం టున్నారు. దీనిపై ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. లేకుంటే మరింత మంది ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదముంది.
        – మజ్జి సూరప్పడు, జిల్లా అధ్యక్షుడు, అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ అసోసియేషన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement