చుక్క, ముక్క.. రూ.40 కోట్లు!
- ఇదీ దసరా లెక్క..!
- ఆదివారం మరో దసరా!!
విశాఖపట్నం : దసరాలో మందుబాబులు చుక్కకు ముక్క జోడించి మజా చేస్తున్నారు. దసరా శుక్రవారం రావడంతో ఆ రోజు వీలైనంత ఎంజాయ్ చేశారు. ఒక్క రోజు వ్యవధిలోనే ఆదివారం రావడంతో మిత్రబృందాలతో కలిసి మళ్లీ సిటింగ్‌లకు సమాయత్తమవుతున్నారు. దసరా అవసరాల కోసం ఎక్సైజ్ అధికారులు రూ.20 కోట్ల మద్యాన్ని సిద్ధం చేశారు. ఇందులో శుక్రవారం మందుప్రియులు రూ.10 కోట్ల విలువైన లిక్కర్‌ను తాగేశారు. ఆదివారం మిగిలిన రూ.10 కోట్ల మద్యం అమ్ముడైపోతుందని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు.
మరోవైపు దసరాకు మందుతోపాటు మాంసాహారానికి ప్రాధాన్యమ్విడం రివాజు. ఇందులోభాగంగా శుక్రవారం నాటి విజయదశమికి అటు జిల్లాలోనూ, ఇటు నగరంలోనూ భారీగానే చికెన్, మటన్ అమ్మకాలు జరిగాయి. ఒక్క శుక్రవారమే నగరంలో రూ.ఆరు కోట్ల విలువైన (కిలో రూ.150 చొప్పున) నాలుగు లక్షల కిలోల చికెన్, మరో నాలుగు కోట్ల విలువైన మటన్ అమ్ముడయినట్టు అంచనా. ఆదివారం నాటి అమ్మకాలు కూడా దాదాపు అంతే ఉంటాయని మాంసం విక్రయదార్లు అంచనాకొచ్చి ఆ మేరకు సన్నాహాలు చేశారు. ఆదివారం అర్బన్ పరిధిలో నాలుగు లక్షల కిలోల చికెన్ డిమాండ్ ఉండవచ్చని ‘బ్యాగ్’ అధ్యక్షుడు ఆదినారాయణ తెలిపారు. దీంతో మాంస విక్రయాలు రూ.20 కోట్ల వరకూ ఉండవచ్చని భావిస్తున్నారు.
ఫుల్‌కే ప్రాధాన్యత!
ప్రతి నెలా ఎక్సైజ్ శాఖ జిల్లాకు దాదాపు రూ.90 నుంచి 100 కోట్ల విలువైన మద్యాన్ని విడిపిస్తుంది. దసరాను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈ నెల రూ.120 కోట్ల లిక్కర్‌ను విడిపించారు. జిల్లావ్యాప్తంగా 312 మద్యం దుకాణాలు, 134 బార్ల ద్వారా వీటి విక్రయాలు జరుగుతాయి. దసరా నాడు రూ.10 కోట్ల అమ్మకాలు జరగ్గా మిగిలింది ఆదివారం తాగేస్తారని భావిస్తున్నారు. ఈ అమ్మకాల్లో ఆఫీసర్ ఛాయిస్, ఏసీ ప్రీమియం, బ్యాగ్‌పైపర్, డెరైక్టర్స్ స్పెషల్ వంటి బ్రాండ్లు అత్యధికంగా అమ్ముడుపోయినట్టు ఎక్సైజ్ అధికారులు చెప్పారు. విశేషమేమిటంటే వీటిలో ఎక్కువ మంది ఫుల్‌బాటిళ్లను కొనుగోలు చేసిన వారే ఉన్నారు. నలుగురైదుగురు కలిసి మందుకొట్టేందుకు వీలుగా ఇలా ఫుల్‌బాటిళ్లను కొనుగోలు చేశారని చెబుతున్నారు. మరోవైపు ఇప్పటికే స్టార్ హోటళ్ల యజమానులు మద్యం నిల్వలను మూడింతలు పెట్టుకున్నారు.
బెంగాలీల సందడి..
దసరాను విశాఖలో ఎంజాయ్ చేసేందుకు బెంగాలీలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దసరాకు ఏటా ఇచ్చే సెలవులను విశాఖలో సెలబ్రేట్ చేసుకుంటారు. నాలుగు రోజులుగా విశాఖలోని స్టార్ హోటళ్లు, లాడ్జిలు నిండిపోయాయి. ఆరో తేదీ వరకూ ఇదే పరిస్థితి ఉంటుందని హోటళ్ల సంఘ ప్రతినిధులు చెబుతున్నారు. ఉద్యోగులు ఈ నెల ఆరేడు తేదీల్లో బయల్దేరినా పర్యాటకులు మాత్రం డిసెంబర్ ఆఖరు వరకూ ఇలా వస్తూనే ఉంటారని అంటున్నారు. బెంగాలీలు, ఇతర పర్యాటకులు విశాఖ పరిసర పర్యాటక ప్రాంతాలకుకార్లలో షికారు చేస్తుండడంతో కార్లకు డిమాండ్ పెరిగింది.