ఇంతకీ రాజీనామా చేశారా.. లేదా? | ambiguity over resignations of deficted mlas | Sakshi
Sakshi News home page

ఇంతకీ రాజీనామా చేశారా.. లేదా?

Published Tue, Apr 4 2017 12:25 PM | Last Updated on Thu, May 24 2018 12:31 PM

ఇంతకీ రాజీనామా చేశారా.. లేదా? - Sakshi

ఇంతకీ రాజీనామా చేశారా.. లేదా?

వైఎస్ఆర్‌సీపీ నుంచి పార్టీ ఫిరాయించి తెలుగుదేశం పార్టీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలకు చంద్రబాబు మంత్రి పదవులు కట్టబెట్టారు. అయితే, అసలు వీళ్లు తమ పదవులకు రాజీనామాలు చేశారా లేదా అన్న విషయం మాత్రం ఇంతవరకు తెలియడం లేదు. నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసినట్లుగా వదంతులైతే వస్తున్నాయి గానీ, ఎక్కడా ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం లేదు. వాళ్ల రాజీనామా లేఖలు ముఖ్యమంత్రి వద్ద ఉన్నాయా, అసెంబ్లీ స్పీకర్ వద్ద ఉన్నాయా అన్న విషయం కూడా తెలియడం లేదు. ఎవరైనా సరే పార్టీ మారినప్పుడు ముందు తామున్న పార్టీ ద్వారా సంక్రమించిన అన్ని పదవులకు రాజీనామా చేయడం పద్ధతి. అలా చేయించకపోగా.. మొత్తం 21 మంది ఎమ్మెల్యేలకు పచ్చ కండువాలు కప్పి తమ పార్టీలోకి తీసుకున్న చంద్రబాబు నాయుడు.. వాళ్లలో నలుగురిని ఏకంగా కేబినెట్‌లోకి తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సొంత పార్టీకి చెందిన సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటివాళ్లు సైతం.. అసలు ఇది ఏ పార్టీ మంత్రివర్గం అని ప్రశ్నించే పరిస్థితి ఏర్పడింది. సొంత పార్టీలో బోలెడంత మంది సీనియర్లు, ఆశావహులు కూడా ఉన్నప్పటికీ వాళ్లందరినీ కాదని నలుగురు వేరే పార్టీ ఎమ్మెల్యేలకు పదవులు ఇవ్వడం తీవ్ర విమర్శలకు దారితీసింది.

ఇప్పుడు వాళ్ల రాజీనామాలపై సరికొత్త డ్రామాకు చంద్రబాబు తెరతీశారు. సాంకేతికంగా వాళ్లు రాజీనామా చేసినట్లు చూపించి, వాటిని స్పీకర్ ఇంకా ఆమోదించనట్లుగా చెబితే సరిపోతుందని చూస్తున్నట్లు తెలుస్తోంది. తామైతే ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసినట్లు వాళ్లు చెప్పుకోవడానికి ఒక అవకాశం కల్పించడం, ఆ రాజీనామా లేఖలను తమ వద్దే ఉంచుకోవడం ద్వారా మళ్లీ ఎన్నికలు వచ్చేవరకు వాళ్ల పదవులను భద్రంగా ఉంచడం అనే వ్యూహాన్ని టీడీపీ నేతలు అమలుచేస్తున్నారని అంటున్నారు. అసలు నిజంగా ఈ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారా లేదా అన్న విషయం కూడా ఇంతవరకు ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. దాంతో రాష్ట్ర రాజకీయాల్లో అసలు ఏం జరుగుతోందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. కొత్తగా మంత్రి పదవులు చేపట్టిన నలుగురు ఎమ్మెల్యేలు భూమా అఖిలప్రియ, అమర్‌నాథ రెడ్డి, ఆదినారాయణరెడ్డి, సుజయ్ కృష్ణ రంగారావు రాజీనామా చేశారా లేదా అనే విషయాన్ని స్పీకర్ కార్యాలయం కూడా ఇంతవరకు ప్రకటించలేదు. దాంతో ఈ విషయంలో ఇప్పటికీ సందిగ్ధత కొనసాగుతోంది. గతంలో తలసాని శ్రీనివాస యాదవ్ వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుబట్టిన చంద్రబాబు ఇప్పుడు చేసింది ఏంటని విమర్శిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement