అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్ : పసిపిల్లల నుంచి పండుటాకుల వరకూ ‘సమైక్య’ నినాదంతో ‘అనంత’ మార్మోగుతోంది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకూ ఎత్తిన పిడికిలి దించేది లే దంటూ ప్రజలు ఉద్యమపథాన సాగుతున్నారు. ఐదో రోజైన ఆదివారం కూడా జిల్లా వ్యాప్తంగా ఉద్యమం ఉద్ధృతంగా కొనసాగింది. గత నాలుగు రోజుల కంటే నిరసన సెగలు మరింత ఎగిసిపడ్డాయి. రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి మాతృమూర్తి వైకుంఠ సమారాధనలో పాల్గొనేందుకు మడకశిర మండలం నీలకంఠాపురానికి వచ్చిన ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణకు కూడా ఉద్యమ సెగ తాకింది.
రఘువీరాను పరామర్శించి... ఇంట్లో నుంచి బయటకు వచ్చిన సీఎం, పీసీసీ చీఫ్‌లను చూసిన ఉద్యమకారులు ‘జై సమైక్యాంధ్ర’ అంటూ నినదించారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ వారు జారుకున్నారు. జిల్లా వ్యాప్తంగా సమైక్య ఉద్యమాన్ని ప్రజా సంఘాలు ముందుండి నడిపించాయి. అనంతపురం నగరంలో వేలాది మంది ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. కవులు, కళాకారులు జాతీయ జెండా పట్టుకుని వివిధ వేషధారణలతో నిరసన ప్రదర్శన చేశారు. ఆటో యూనియన్, మినీవ్యాన్, బోర్‌వెల్స్, జేసీబీ ఓనర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు.
కుక్కలకు ఉన్న విశ్వాసం కూడా సోనియాగాంధీకి లేదంటూ ‘రాజహంస పరివార్’ ఆధ్వర్యంలో కుక్క పిల్లలతో నిరసన తెలిపారు. ఉద్యానశాఖ, ఏపీఎంఐపీ అధికారులు, ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగుల యూనియన్, బుక్‌సెల్లర్స్ అసోసియేషన్, గౌడ- ఈడిగ ఉద్యోగుల యూనియన్, జాక్టో, వివిధ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. నగరంలోని వివిధ డివిజన్లు, కాలనీల ప్రజలు స్వచ్ఛందంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. స్థానిక టవర్‌క్లాక్, సప్తగిరి , వైఎస్సార్ సర్కిళ్లలో కేసీఆర్, సోనియాగాంధీ శవయాత్రలు, దిష్టిబొమ్మ దహనాలు చేశారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట జాక్టో ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.
వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మాలగుండ్ల శంకరనారాయణ, నేతలు ఎర్రిస్వామిరెడ్డి, చవ్వా రాజశేఖర్‌రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ధర్మవరంలో దుర్గమ్మకు బోనాలు సమర్పించారు. విద్యార్థి జేఏసీ నేతలు ఆమరణ దీక్షకు దిగారు. తాడిమర్రి, బత్తలపల్లిలోనూ నిరసనలు మిన్నంటాయి. గుంతకల్లులో జేఏసీ నేతలు రోడ్డుపైనే వంటా వార్పుతో నిరసన కొనసాగించారు. ఇందులో వైఎస్సార్‌సీపీ నేత వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు. గుత్తిలో సోనియా, ప్రధాని మన్మోహన్, సీఎం కిరణ్ దిష్టిబొమ్మలను తగులబెట్టారు. ఇదే పట్టణంలో జరిగిన ర్యాలీలో ఎమ్మెల్యే మధుసూదన్‌గుప్తా పాల్గొన్నారు. హిందూపురంలో జేఏసీ నేతలు, ముస్లింలు, క్రైస్తవులు వేర్వేరుగా ర్యాలీలు చేపట్టారు. కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆర్టీసీ కార్మికులు ప్రజాకోర్టు నిర్వహించారు. చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లో ఎంపీ నిమ్మల కిష్టప్పను అడ్డుకున్నారు. అనంతరం కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలతో శవయాత్రలు నిర్వహించారు. కదిరి పట్టణంలో రోడ్డుపైనే వంటావార్పు చేపట్టారు. భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కళ్యాణదుర్గం టీ సర్కిల్‌లో మానవహారం, కేసీఆర్ వేషధారణలో ర్యాలీ చేపట్టారు.
కొత్తచెరువులో యువకుడు ఆత్మహత్యకు ప్రయత్నించగా సమైక్యవాదులు అడ్డుకున్నారు. పెనుకొండలో జాతీయ రహదారిపై వంటా వార్పు కొనసాగించారు. పుట్టపర్తి, పరిగి, గోరంట్ల, కనగానపల్లి, రామగిరి, శింగనమల, గార్లదిన్నె, పామిడి తదితర ప్రాంతాలలో నిరసన ర్యాలీలు హోరెత్తాయి. రొద్దంలో సోనియాగాంధీ దిష్టిబొమ్మను తగులబెట్టారు. తాడిపత్రిలో అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఉరవకొండ మండలం చిన్నముష్టూరులో సోనియా దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. సీఎం కిరణ్ కనిపించడం లేదంటూ ఉరవకొండలో పోస్టర్లు అతికించారు. అలాగే ఉరవకొండ-అనంతపురం రహదారిపై రాస్తారోకో చేశారు.
ఎంపీ అనంతను అడ్డుకున్న ఎస్కేయూ విద్యార్థులు
ఎస్కేయూలో ఆమరణ దీక్ష చేపట్టిన విద్యార్థి జేఏసీ నేతలకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన ఎంపీ అనంత వెంకటరామిరెడ్డిని జేఏసీ నేతలు అడ్డుకున్నారు. కొద్దిసేపటి తర్వాత వారు శాంతించడంతో ఎంపీ మాట్లాడారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్రాన్ని విభజించడం దారుణమన్నారు. అందుకు నిరసనగా స్పీకర్ ఫార్మాట్‌లో ఎంపీ పదవికి రాజీనామా సమర్పించి.. ప్రజలతో కలిసి ఉద్యమంలో పాల్గొంటున్నట్లు తెలిపారు.
ఆమరణ దీక్ష చేపట్టిన విద్యార్థి జేఏసీ నేతలను ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి, ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి వేర్వేరుగా పరామర్శించారు. లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ఉద్యమాలకు ‘అనంత’ పురిటిగడ్డని అభివర్ణించారు. టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా రెండుసార్లు లేఖ ఇవ్వడం వల్లనే కేంద్రం రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకుందన్నారు. తనది ఎక్కడి ప్రాంతమో తెలియకుండానే తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తున్న కేసీఆర్‌కు తలొగ్గిన కాంగ్రెస్ హైకమాండ్ సీమాంధ్రకు తీరని ద్రోహం చేస్తోందని దుయ్యబట్టారు. అలాగే ఎస్కేయూలో సోనియా, కేసీఆర్, చిరంజీవి దిష్టిబొమ్మలను దహనం చేశారు.
అగ్నిగుండమైన మడకశిర
మంత్రి రఘువీరా మాతృమూర్తి వైకుంఠ సమారాధనలో పాల్గొనేందుకు వచ్చిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలకు సమైక్య సెగ తాకింది. మడకశిర పట్టణంలో జేఏసీ, వివిధ వర్గాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ ఓ యువకుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఆరు వాహనాలపై దాడి చేసి అద్దాలు పగులగొట్టారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని అడ్డుకుని... ఆయన వాహనం అద్దాలు పగులగొట్టారు.
అనంతాగ్రహం
Published Mon, Aug 5 2013 5:02 AM | Last Updated on Tue, Jun 4 2019 5:58 PM
Advertisement
Advertisement