
ఆగని అధికార పార్టీ అరాచకాలు
- నంద్యాలలో వైఎస్సార్‌సీపీకి ఓటు వేశారని కుటుంబంపై దాడి
- కర్రలతో కొట్టి గాయపరిచిన వైనం
నంద్యాల అర్బన్: నంద్యాల ఉప ఎన్నికలో పోలింగ్ శాతం భారీగా నమోదు కావడం అధికార టీడీపీ నేతల్లో అసహనం రేగుతోంది. పోలింగ్ సందర్భంగా టీడీపీ అక్రమాలను అడ్డుకున్న వారిపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే వైఎస్సార్‌సీపీకి ఓటు వేశారన్న కారణంతో గురువారం ఓ కుటుంబంపై దాడి చేశారు. మహిళ చీర లాగి గాయపరిచారు. ఈ ఘటన నంద్యాల పట్టణంలోని విశ్వనగర్‌లో చోటు చేసుకుంది. విశ్వనగర్‌కు చెందిన రాములమ్మ కుటుంబం కిరాణా దుకాణం నడుపుకొంటూ జీవనం సాగిస్తోంది. ఇంటి ఎదురుగా పది సెంట్ల స్థలంలో టీడీపీకి చెందిన సుబ్బయ్య ఇసుక డంపు నిర్వహిస్తున్నాడు.
బుధవారం జరిగిన ఉప ఎన్నిక పోలింగ్‌లో రాములమ్మ కుటుంబంతోపాటు ఇరుగుపొరుగు కుటుంబాల వారు వైఎస్సార్‌సీపీకి ఓటు వేశారు. దీన్నిజీర్ణించుకోలేని సుబ్బయ్య కుటుంబ సభ్యులు టీడీపీకి ఎందుకు ఓటు వేయలేదంటూ గురువారం రాములమ్మ కుటుంబంతో వాదనకు దిగారు. తాము వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులమని, తమకు ఇష్టమైన వారికి ఓటు వేసుకునే హక్కు ఉందంటూ రాములమ్మ కుటుంబం సమాధానం ఇచ్చింది. దీంతో సుబ్బయ్య కుటుంబ సభ్యులు, అనుచరులు ఒక్కసారిగా వారిపై దాడికి దిగారు. కిరాణా షాపులోని వస్తువులను బయటకు విసిరేశారు. అడ్డొచ్చిన రాములమ్మ చీర లాగుతూ వీరంగం సృష్టించారు. ఇదేమని ప్రశ్నించిన పక్కింటి మహిళ కవితను తోసేశారు. రాములమ్మతోపాటు ఆమె కుమారుడు శ్రీనివాసరెడ్డిపై కర్రలతో దాడి చేసి గాయపరిచారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.