
‘అగ్ర’ సినిమాలకు హై అలర్ట్
- సినిమాల రిలీజ్‌లపై డీజీపీ స్థాయిలో పోలీస్‌శాఖ అప్రమత్తం
- అభిమానులపై డేగకన్ను
- నేడు చిరు ‘ఖైదీ నంబర్ 150’ రిలీజ్
- రేపు బాలయ్య ‘శాతకర్ణి’ విడుదల
- భారీ అంచనాలు, జోరుగా బెట్టింగ్‌లు
సాక్షి, అమరావతి: ఈ సంక్రాంతికి అగ్రహీరోల సినిమాలు ఒకేసారి విడుదల కానుండటంతో రాష్ట్రమంతా ఉత్కంఠ నెలకొంది. ఖైదీ నంబర్ 150 సినిమా బుధవారం విడుదల కాగా, గౌతమీపుత్ర శాతకర్ణి గురువారం రిలీజ్ కాబోతోంది. ఈ ఏడాది సంక్రాంతి బరిలో కోడి పందేలపై నెలకొన్న ఉత్కంఠత కంటే ఇద్దరు అగ్రహీరోల సినిమాలపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తొమ్మిదేళ్ల తరువాత చిరంజీవి నటించిన సినిమాపై ఆయన అభిమానులు ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా బాలకృష్ణ వందో చిత్రం శాతకర్ణి ప్రతిష్టాత్మకం కావడంతో ఆయన అభిమానుల్లోనూ అదే స్థాయిలో ఆసక్తి కన్పిస్తోంది. పవన్ కళ్యాణ్ నటించిన ‘కాటమరాయుడు’ చిత్రం టీజర్‌ను జనవరి 14న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుండటం గమనార్హం.
పోలీసుల హై అలర్ట్...
చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ కేవలం సినిమా హీరోలే కాకుండా రాజకీయాలతో ముడిపడిన వారు కావడంతో పోలీసులు మరింత అప్రమత్తమైనట్టు సమాచారం. ఈ సినిమాల రిలీజ్ సమయంలో ఏ చిన్న ఘటన జరిగినా రాజకీయాలపై ప్రభావం పడే ప్రమాదం ఉండటంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. సినిమాల రిలీజ్ నేపథ్యంలో తొలిసారిగా డీజీపీ స్థాయి అధికారి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఎస్పీలతో టెలికాన్ఫరెన్సు నిర్వహించిన డీజీపీ నండూరి సాంబశివరావు థియేటర్ల వద్ద పోలీస్ బందోబస్తుతోపాటు అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. హద్దుమీరొద్దంటూ అభిమానులకు వార్నింగ్ కూడా ఇచ్చారు.
భారీగా బెట్టింగ్‌లు..
సంక్రాంతికి కోడి పందేల కంటే చిరంజీవి, బాలకృష్ణ సినిమాలపైనే ప్రధానంగా బెట్టింగ్‌లు జరుగుతున్నట్టు సమాచారం. ఖైదీ నంబర్ 150 సినిమా వంద కోట్లు వసూళ్లు చేస్తుందని అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు. బాలకృష్ణ సినిమా కూడా వంద కోట్లు వసూలుపై దృష్టి పెట్టారని చెబుతున్నారు. దీంతో తొలి షో బ్లాక్ టిక్కెట్ రేటు ఎంతకు అమ్ముడుపోతుంది. ఎన్ని థియేటర్లలో ఎన్ని షోలు ప్రదర్శిస్తారు. వారం రోజుల్లో ఏ సినిమాకు ఎంత కలెక్షన్ వస్తుంది. ఇలా అనేక కోణాల్లో బెట్టింగ్‌లు ఊపందుకోవడం గమనార్హం.