2029 నాటికి దేశంలోనే ఏపీ అగ్రస్థానం
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో సమావేశం అయ్యారు. విజయవాడలోని A-కన్వెన్షన్ హాల్లో ఆయన రాష్ట్రానికి నీటి కేటాయింపులు, ప్రాథమిక రంగ మిషన్, సమగ్ర అభివృద్ధికి చేపట్టాల్సిన పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ 2029 సంవత్సరం నాటికి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉండాలనే ప్రణాళికతో ఉన్నామన్నారు.
7 మిషన్లు, 5 గ్రిడ్లతో ముందుకు దూసుకుపోదామని పిలుపునిచ్చారు. వృధాగా పోయే నీటిని వినియోగించుకోవాలన్నారు. పోలవరం ప్రాజెక్ట్కు ప్రధాన అడ్డంఉకులు తొలగిపోయాయని...ప్రాజెక్ట్ ను త్వరితగతిన పూర్తి చేస్తామని చంద్రబాబు తెలిపారు. చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా పట్టిసీమ ప్రాజెక్ట్ను పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.
బడ్జెట్లో కేటాయించిన నిధులన్నీ నూటికి నూరుశాతం ఖర్చు చేస్తున్నామన్నారు. రాష్ట్ర విభజనతో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నామని, విద్యుత్ కొరతను అధిగమించామని చంద్రబాబు అన్నారు. నీరు-చెట్టు కార్యక్రమం ద్వారా మంచి ఫలితాలు అందుకుంటున్నామన్నారు. ఈ సమావేశానికి పలువురు రాష్ట్ర మంత్రులు హాజరు అయ్యారు.