
పరుగుల వీరుడు అనిల్
జిల్లా, రాష్ట్ర స్థాయిలో
ఎనిమిది పతకాలు
చదవులోనూ దిట్ట
కనగానపల్లి: కనగానపల్లికి చెందిన అంకె అనిల్ ఓంకార్ పరుగు పందెంలో పాఠశాల నుంచి రాష్ర్ట స్థాయి పోటీల వరకు రాణిస్తూ పరుగుల వీరుడిగా గుర్తింపు పొందుతున్నాడు. చిత్తూరు జిల్లాలోని సత్యవేడు ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలో 10వ తరగతి వరకు చదివిన ఈ విద్యార్థి ఒక విద్యా సంవత్సరం(2014-15)లోనే ఎనిమిది పతకాలు సాధించాడు. వంద మీటర్ల పరుగు పందెంలోనే కాకుండా సుదీర్ఘ దూరం పరిగెత్తే (800 మీటర్లకు పైగా) పరుగు పందెం పోటీల్లో పాల్గొని విజయాలు సాధిస్తూ అనేక పతకాలు, సర్టిఫికెట్లు సాధించాడు.
2014, అక్టోబర్‌లో చిత్తూరు జిల్లా బీరకుప్పంలో జరిగిన జోనల్ స్థాయి పరుగు పోటీల్లో రాణించి 1500 మీటర్లు, 600 మీటర్ల పోటీలలో మొదటి స్థానంలో నిలిచాడు. 800 మీటర్ల పరుగు పందెంలో రెండో స్థానంలో నిలిచి పతకాలు సాధించాడు. 2014 నవంబర్‌లో చిత్తూరు జిల్లా పుంగనూరులో జిల్లా స్థాయిలో జరిగిన 3000 మీటర్లు పరుగులో మొదటి స్థానం, 800 మీటర్ల పరుగులో మూడో స్థానం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.
అనంతరం 2015 జనవరిలో కృష్ణా జిల్లాలో రాష్ట్ర స్థాయి పోటీల్లో 800 మీటర్ల పరుగులో మొదటి స్థానంలో నిలిచాడు. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఈ విద్యార్థి ఐదో తరగతిలో రెసిడెన్షియల్ స్కూల్‌లో సీటు సాధించి చదువులోనూ ముందున్నాడు. ఇతని తల్లిదండ్రులు సుబ్రమణ్యం, నాగలక్ష్మమ్మ గ్రామంలో టీకొట్టు నడుపుకొంటూ జీవనం చేస్తున్నారు.