రోశయ్యా..! ఇదేమిటయ్యా? | ANU UG co ordinator errors | Sakshi
Sakshi News home page

రోశయ్యా..! ఇదేమిటయ్యా?

Published Fri, Nov 3 2017 12:37 PM | Last Updated on Fri, Nov 3 2017 12:37 PM

ANU UG co ordinator errors

నరసరావుపేట ఈస్ట్‌: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ) యూజీ పరీక్షల విభాగం ముప్పుతిప్పలు పెడుతోందని విద్యార్థులు, అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూజీ (అండర్‌ గ్యాడ్యూయేషన్‌) పరీక్షల విభాగం పనితీరు అస్తవ్యస్తంగా ఉండటం, యూజీ విభాగం కో–ఆర్డినేటర్‌ ఏకపక్ష నిర్ణయాలతో వర్సిటీ పరిధిలో ప్రతిష్టంభన నెలకొన్నట్లు కనిపిస్తోంది. విద్యార్థుల నుంచి శాస్త్రీయత లేకుండా ఫీజుల వసూళ్లు చేపడుతున్నారని, అధ్యాపకుల సమాధాన పత్రాల మూల్యాంకనంలో గౌరవ వేతనాల చెల్లింపులు సక్రమంగా లేవని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

వెళితే ప్రయోజనం ఏంటని ప్రశ్నలు..
ఈ అక్టోబరులో నిర్వహించిన సెమిస్టర్‌ పరీక్షల మూల్యాంకనం బుధవారం నుంచి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మూల్యంకనానికి వెళ్తున్న అధ్యాపకుల్లో రెమ్యూనరేషన్‌ వస్తుందా? లేదా రాదా? అనే సందిగ్ధంలో ఉన్నట్లు తెలిసింది. గతంలో విధులు నిర్వహించిన దానికే గౌరవ వేతనం రాలేదని, ఇప్పుడు తిరిగి వెళితే ప్రయోజనం ఏంటని అధ్యాపకుల్లో చర్చ మొదలుకావడం గమనార్హం. సాక్షాత్తూ వర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ సమక్షంలో రెండు నెలల్లో బకాయిలు విడుదల చేస్తానని ఒప్పుకుని ఇప్పటివరకూ విడుదల చేయకపోవడంపై  అధ్యాపకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి బాధితులు గుంటూరు, నరసరావుపేట, ఒంగోలు, చీరాల, ప్రాంతాల్లో వందల మంది ఉన్నారు. వర్సిటీ పరిధిలోని వాల్యూయేషన్‌ కేంద్రాల పరిధిలో పనిచేసిన వారికి కూడా వేతనాలు అందించడం లేదని తెలిసింది. గతేడాది మార్చిలో చేసిన వాల్యూయేషన్‌కు ఇంకా బకాయిలు ఉన్నాయని వర్సిటీ క్యాంపు అధికారులు చెబుతున్నారు. వర్సిటీ యూజీ విభాగం తప్పిదాలతో అధ్యాపకులు సమ్మె చేసే పరిస్థితి నెలకొందంటున్నారు. వాల్యూయేషన్‌కు హాజరయ్యే అధ్యాపకులకు కూడా 2016 నవంబర్, 2017 మార్చి లో జరిగిన మూల్యాంకనానికి సంబంధించిన గుర్తింపు కార్డులే ఇచ్చారని, తాము కళాశాల మారినప్పటికీ పాత గుర్తింపు కార్డులతో వెళ్లాల్సివస్తోందని అధ్యాపకులు చెబుతున్నారు.

రెమ్యునరేషన్లు అందజేస్తాం..
పాత బకాయిలతో కలిపి ప్రస్తుత మూల్యాం కనానికి సంబంధించిన నగదును త్వరలో విడుదల చేస్తాం. ఒకటి, రెండురోజుల్లో దీనికి సంబంధించిన చెక్కులను ఆయా కేంద్రాలకు పంపిస్తాం.  గుర్తింపుకార్డుల విషయంలో అధ్యాపకులు సీనియారిటీ నిరూపించుకోవాల్సి ఉంది. కొత్తగుర్తింపు కార్డులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం.– జి.రోశయ్య, వర్సిటీ యూజీ కో– ఆర్డినేటర్‌

ఆయన నిర్ణయాల వల్లే..
యూజీ కో–ఆర్డినేటర్‌గా రోశయ్య బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అన్ని విషయాల్లోనూ అవకతవకలు చోటుచేసుకుంటున్నట్లు యూనివర్సిటీ వర్గాలే భావించడం గమనార్హం. ఏటా మార్చిలో నిర్వహించే పరీక్షలను ఎప్పుడూ లేని విధంగా ప్రకటించిన షెడ్యూలు కంటే ముందుగా పరీక్షలు నిర్వహించి విద్యార్థులు ఒక ఏడాది నష్టపోయేలా చేయడం వీరికే చెల్లిందనే విమర్శలు ఉన్నాయి. ఫీజు వసూళ్లలో ఎలాంటి వెసులుబాటు ఇవ్వకుండా జరిమానాతో సహా వసూలు చేసే విధానానికి ఆయన ఊపిరిలూదారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటికి తోడు పరీక్షల మూల్యాంకనంలో అవకతవకలు చోటు చేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

గౌరవ వేతనాలు రూ.లక్షల్లో పెండింగ్‌..
డిగ్రీ పరీక్షల సమాధాన పత్రాలను మూల్యాంకనం చేసిన అధ్యాపకులకు అప్పటికప్పుడే వేతనాలను చెల్లించడం ఆనవాయితీగా ఉండేది. రోశయ్య బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అధ్యాపకులకు రెమ్యూనరేషన్‌ చెల్లింపులో మెలిక పెడుతున్నట్లు అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు నరసరావుపేట ఎస్‌.ఎస్‌.ఎన్‌ కళాశాలలో 2016 నవంబరులో సెమిస్టర్‌ పరీక్ష పత్రాల మూల్యంకనం నగదు ఇప్పవరకూ విడుదల చేయలేదు. అలాగే 2017 మార్చిలో జరిగిన మూల్యాంకన నగదు రూ.11 లక్షలు, గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాలకు  రూ.4 లక్షలు, ఒంగోలు ప్రభుత్వ కళాశాలకు రూ.10 లక్షలు, చీరాల వై.ఆర్‌.ఎన్‌ కళాశాలకు రూ.6 లక్షల బకాయిలు చెల్లించాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement