మహిళల భద్రతకు సరికొత్త చట్టం | AP Govt has prepared a New Act for the Protection of Women | Sakshi
Sakshi News home page

అత్యాచారానికి పాల్పడితే మరణ శిక్షే

Published Mon, Dec 9 2019 4:15 AM | Last Updated on Mon, Dec 9 2019 8:04 AM

AP Govt has prepared a New Act for the Protection of Women  - Sakshi

సాక్షి, అమరావతి: మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే మరణ శిక్ష విధించేలా సరికొత్త చట్టం తేవడానికి రాష్ట్ర ప్రభుత్వ రంగం సిద్ధం చేసింది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోనే దీనికి కార్యరూపం ఇవ్వనుంది. ఇలాంటి కేసుల విచారణ నెలల తరబడి సాగకుండా మూడు వారాల్లో పూర్తి చేసి నిందితులకు రోజుల వ్యవధిలోనే శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోబోతోంది. ఈ కేసుల విచారణకు జిల్లాజడ్జితో కూడిన జిల్లాకో ప్రత్యేక కోర్టు, అవసరమైన పక్షంలో ఇంకో కోర్టు కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మహిళల భద్రతకు సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలకు మరింత పదును పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.   

విప్లవాత్మక చట్టాలు 
గత బడ్జెట్‌ సమావేశాల్లో పలు విప్లవాత్మక, చరిత్రాత్మక చట్టాల రూపకల్పనకు వేదికైన అసెంబ్లీ.. మరోమారు ఆ తరహాలో మరికొన్ని చట్టాలను రూపొందించడానికి సిద్ధమైంది. నేటి నుంచి ప్రారంభం కానున్న శాసన సభ, మండలి సమావేశాల్లో పలు ముఖ్యమైన చట్టాలను చేసేందుకు అధికారపక్షం అడుగులు వేస్తోంది. ఈ చట్టాలకు సంబంధించిన ముసాయిదా బిల్లులను ఈ నెల 11వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశాల్లో ఆమోదించాక సభలో ప్రవేశపెట్టనున్నారు. తొలి రోజు సోమవారం మహిళల భద్రతపై  చర్చను ఉభయ సభల్లో చేపట్టనున్నారు.

ఈ అంశాన్ని అజెండాలో చేర్చారు. గత ఆరు నెలల పాలనలో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా క్షేత్ర స్థాయిలో అమలు చేసి చూపించడాన్ని సభ దృష్టికి తీసుకురానున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుతో పాటు 1.34 లక్షల శాశ్వత ఉద్యోగాలను కొత్తగా సృష్టించి భర్తీ చేయడం, ఇచ్చిన మాట కన్నా ముందుగా, మెరుగ్గా వైఎస్సార్‌ రైతు భరోసా అమలు, నవరత్నాల్లోని ఇతర పథకాలు, కార్యక్రమాల అమలుపై అసెంబ్లీ, శాసన మండలి సమావేశాల్లో చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాల అనంతరం బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ సమావేశమై ఎన్ని రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనే దానితో పాటు అజెండా అంశాలను ఖరారు చేయనుంది.   

ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ సిబ్బంది
ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కలను నిజం చేస్తూ ఈ అసెంబ్లీ సమావేశాల్లో కొత్త చట్టాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ‘అబ్జార్ప్షన్‌ ఆఫ్‌ ఎంప్లాయిస్‌ ఆఫ్‌ ఏపీఎస్‌ఆర్టీసీ ఇన్‌ టు గవర్నమెంట్‌ సర్వీస్‌ యాక్ట్‌–2019’ను తేనుంది. ఆర్టీసీ ఉద్యోగులందరినీ ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఈ చట్టం వీలు కల్పిస్తుంది. ఇందుకోసం ప్రజా రవాణా శాఖను ఏర్పాటు చేస్తారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు ఇకపై ప్రజా రవాణా శాఖ (ప్రభుత్వ) ఉద్యోగులు కానున్నారు. ఈ చారిత్రక చట్టం చేయడం ద్వారా 52 వేల మందికి   ఇచ్చిన మాటను నెరవేర్చిన సీఎంగా వైఎస్‌ జగన్‌ చరిత్రలో నిలిచిపోతారని ఆర్టీసీ ఉద్యోగులు పేర్కొంటున్నారు. 

చిరు, పప్పు ధాన్యాల సాగు ప్రోత్సాహానికి ప్రత్యేక బోర్డులు
- ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు కలిపి ఒకే కమిషన్‌ ఉంది. ఇకపై వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటు చేస్తూ రెండు బిల్లులను అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించడం ద్వారా చట్టాలను చేయనున్నారు. 
చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాల సాగును ప్రోత్సహించడంతో పాటు ఆ పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేసేందుకు చట్టాలు చేయనున్నారు.
పేదలకు ఇచ్చే ఇంటి స్థలాలను ఐదేళ్ల అనంతరం విక్రయించడానికి వీలు కల్పిస్తూ చట్టం చేయనున్నారు. 
నూతన బార్ల విధానం, సగానికి పైగా మద్యం షాపుల తగ్గింపు, 40 శాతం మేర బార్ల సంఖ్య తగ్గింపునకు సంబంధిత చట్టాల్లో సవరణలు చేయనున్నారు. 
అడ్వకేట్‌ సంక్షేమ నిధి చట్టంలో సవరణలకు బిల్లును ప్రవేశపెట్టనున్నారు. 

ఈ సమావేశాల్లో చర్చకు రానున్న అంశాలు
- రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు – ప్రభుత్వ చర్యలు
గ్రామ, వార్డు సచివాలయాలు – వలంటీర్లు – కొత్తగా శాశ్వత ఉద్యోగాల కల్పన
వ్యవసాయ రంగం – రైతు భరోసా, మద్దతు ధర
- మద్య నియంత్రణ విధానం – ప్రభుత్వ చర్యలు
- ఆంగ్ల విద్య ఆవశ్యకత – అమ్మ ఒడి, నాడు–నేడు
- విద్య వైద్య రంగాల్లో సంస్కరణలు
అగ్రిగోల్డ్‌ బాధితులు – ప్రభుత్వ చర్యలు
సంక్షేమ పథకాలు – ప్రభుత్వ చర్యలు
- స్పందన కార్యక్రమం – అవినీతి నిర్మూలన – పారదర్శక పాలన
- రాజధాని – గత ప్రభుత్వ చర్యలు – అప్పులు
విద్యుత్‌ పీపీఏలు – ప్రభుత్వ చర్యలు
పోలవరంతో పాటు ఇతర ప్రాజెక్టులు – వాటర్‌ గ్రిడ్స్‌ – రివర్స్‌ టెండరింగ్‌ 
విభజన హామీలు
- పెట్టుబడులు – భూ కేటాయింపులు
గృహ నిర్మాణం – ఇళ్ల స్థలాల పంపిణీ
- శాంతి భద్రతలు – ప్రభుత్వ చర్యలు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement