సాక్షి, హైదరాబాద్: ఎవరు అవునన్నా, కాదన్నా.. పురుషాధిక్య సమాజంలో మహిళలంటే చిన్నచూపే. లైంగిక దాడికి గురైన బాధితులంటే మరీనూ. బయటికొస్తే చాలు అవమానపు మాటలు, అనుమానపు చూపులతో బతకడమే వృథా అనే పరిస్థితులను అధిగమించి.. కొత్త జీవితాన్ని ప్రారంభించాలంటే ఎంతో మనోధైర్యం, భరోసా అవసరం.
ఇలాంటివారి జీవితాల్లో వసంతాన్ని నింపేందుకు తెలంగాణ మహిళా భద్రతా విభాగం సరికొత్త కార్యక్రమానికి ప్రణాళిక రచిస్తోంది. బాధిత మహిళలు సొంతంగా వ్యాపారం చేసుకునేందుకు అవసరమైన ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందుకోసం మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఇంక్యుబేటర్ వీ–హబ్‌తో చేతులు కలిపింది. బాధిత మహిళలకు జీవనోపాధికి అవసరమైన ఆర్ధిక భరోసా, సాంత్వన అందించనుంది.
ఎంపిక ఎలా? ఎలాంటి వ్యాపారాలు?
మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నడుస్తున్న భరోసా కేంద్రాల ద్వారా లైంగిక దాడికి గురైన బాధితులను ఎంపిక చేస్తారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, పథకాలు గురించి వారికి అవగాహన కల్పిస్తారు.
సొంతంగా వ్యాపారం, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్న ఆసక్తి, నైపుణ్యం ఉంటే.. వారితో మాట్లాడి, ఆలోచనలకు కార్యరూపంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తారు. వారి ఆర్ధిక వనరుల గురించి అధ్యయనం చేసి, చేయూతనిస్తారు. స్వీట్లు, బిస్కెట్లు, చాక్లెట్లు, బేకరి ఉత్పత్తులు వంటి తినుబండారాల వ్యాపారం, బ్యూటీపార్లర్, కుట్లు అల్లికలు, జ్యువెలరీ తయారీ వంటి చిన్న తరహా వ్యాపారాలు చేసుకునేందుకు సహకరిస్తారు.
వందకు పైగా బాధితులకు శిక్షణ..
తొలి దశలో మేడ్చల్, వరంగల్ వంటి ఏడు జిల్లాల నుంచి వందకు పైగా బాధిత మహిళలను ఎంపిక చేసినట్లు తెలిసింది. తొలి సెషన్‌లో బాధితులు, వారి కుటుంబ సభ్యులతో చర్చించి, వారి వ్యాపార ఆలోచనల గురించి తెలుసుకున్నామని, ఆయా వ్యాపార అవకాశాలపై వారికి అవగాహన కల్పిచామని వీ–హబ్ ప్రతినిధి ఒకరు తెలిపారు. త్వరలో రెండో సెషన్ నిర్వహించి, ఎవరు ఏ కేటగిరీ వ్యాపారాలకు సెట్ అవుతారో అధ్యయనం చేసి, ఎంపిక చేస్తామన్నారు.
వీ–హబ్ ఏం చేస్తుందంటే?
ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఎదురయ్యే ప్రధాన ఇబ్బంది గుర్తింపు లేకపోవటమే. బాధిత ఎంటర్‌ప్రెన్యూర్లకు ఆ ఇబ్బంది ఉండదు. ఏ తరహా వ్యాపారానికి ఎలాంటి లైసెన్స్‌లు అవసరం దగ్గరి నుంచి డాక్యుమెంటేషన్, మార్కెటింగ్, పథకాలు, ఆర్ధిక వనరుల వరకూ అన్ని వైపుల నుంచి సహాయసహకారాలు అందిస్తారు. వీ–హబ్ మెంటార్‌షిప్‌తో పాటు క్రెడిట్ లింకేజ్ కోసం రుణ దాతలు, రుణ గ్రహీతలను కలుపుతారు.
ప్రాథమిక దశలో ఉంది..
మహిళల భద్రతే షీ టీమ్స్, ఉమెన్ సేఫ్టీ వింగ్ తొలి ప్రాధాన్యం. లైంగిక దాడి బాధితులకు కావాల్సిన సహాయం చేసేందుకు నిత్యం సిద్ధంగా ఉంటాం. బాధిత మహిళలకు అండగా నిలవడం కోసం చేపట్టిన ఈ కార్యక్రమం ప్రస్తుతం ప్రారంభ దశలో ఉంది. – శిఖా గోయల్, అదనపు డీజీ, ఉమెన్ సేఫ్టీ వింగ్
Comments
Please login to add a commentAdd a comment