
ఇన్‌పుట్ సబ్సిడీని సర్కార్ ఎగ్గొట్టింది
అమరావతి : రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల విషయంలో చంద్రబాబు సర్కార్ కుటిల వైఖరిని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం అసెంబ్లీలో ఎండగట్టారు. ఎన్నికల హమీలను తుంగలోకి తొక్కి ప్రభుత్వం రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఎగరగొట్టిందని ఆయన ఆరోపించారు. 2013 నుంచి 2016 వరకూ మొత్తం రూ. 8వేల కోట్లకు గాను సర్కార్ ఇచ్చింది కేవలం రూ. 1,546 కోట్లు మాత్రమేనని... మిగిలిన రూ.6,400 కోట్ల సంగతేంటని వైఎస్ జగన్ నిలదీశారు.
ఇన్‌పుట్ సబ్సిడీ బకాయిలపై హామీ ఇచ్చి రైతులను మోసం చేశారని, కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించారని ఆయన అన్నారు. తుపానులు, కరువుల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా...గత పదేళ్ల కాలం నాటి సంగతలు ఎత్తుతున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయి ఎనిమిదేళ్లు అయిందని, అలాంటిది అప్పట్లో ఏం జరిగిందనే దానిపై ప్రభుత్వం చెప్పడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం వాస్తవాలు చెప్పకుండా దాచిపెడుతోందని అన్నారు. 2014-16కు సంబంధించి ఇన్‌పుట్ సబ్సిడీని కూడా ప్రభుత్వం చెల్లించలేదన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైఎస్‌ఆర్ సీపీ సభ నుంచి వాకౌట్ చేసింది.