సాక్షి, అమరావతి: మిర్చి కోతలకు కూలీల కొరత.. గ్రేడింగ్ సమస్య లేకుండా ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిచ్చాయి. కోసిన పంటను నిల్వ చేసుకునే వెసులుబాటు కల్పించడం కూడా కలిసి వచ్చింది. కరోనా వల్ల తలెత్తిన విపత్కర పరిస్థితుల్లోనూ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో తాము గట్టెక్కుతామనే ధైర్యం ఏర్పడింది. ముందెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్ మిర్చికు రూ.7 వేల కనీస మద్దతు కల్పించడంతో అప్పుల బారినుంచి గట్టెక్కుతామని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడంతో లాక్‌డౌన్ ముగిసిన వెంటనే మిర్చి అమ్మకాలు, ఎగుమతులు సాగించే వెసులుబాటు కలిగిందని రైతులు, వ్యాపారులు తెలిపారు.
‘మాది కర్నూలు జిల్లా అవుకు మండలం సింగనపల్లి. తొమ్మిదెకరాల్లో మిర్చి పంట వేశా. మా జిల్లాలో కోతలు దాదాపు పూర్తయ్యాయి. తొలి రెండు కోతల్లో వచ్చిన కాయల్ని అమ్మేశా. మిగతా కోత కాయల్ని అమ్ముదామంటే గుంటూరు యార్డు లాక్‌డౌన్‌లో ఉంది. అందుకని అక్కడే ఓ కోల్ట్ స్టోరేజీలో పెట్టా. లాక్‌డౌన్ ముగిశాక మంచి ధర వస్తుందని ఆశిస్తున్నా’
– మురళీమోహన్‌రెడ్డి, మిర్చి రైతు
‘మాది ప్రకాశం జిల్లా ఇంకొల్లు. ఐదెకరాల్లో మిర్చి వేశా. తొలి పంట అమ్మేశాను. మిగతా పంటను అమ్ముదామనుకునే లోగా లాక్‌డౌన్ వచ్చింది. యార్డు మూతపడింది. అందుకే మిగిలిన సరుకు కోల్డ్ స్టోరేజీలో ఉంచా. దేశ చరిత్రలో తొలిసారి మిర్చికి రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.7 వేలు ప్రకటించింది. దీనివల్ల బయ్యర్లు మంచి రేటే ఇస్తారనుకుంటున్నాను. పాత అప్పు తీర్చేశాను. కౌలు మాత్రం చెల్లించాలి. కొత్త కాయ అమ్మి కౌలు కూడా తీర్చేస్తా’
– పి.హన్మంతు, మిర్చి రైతు
86 శాతం కోతలు పూర్తి
► రాష్ట్రంలో రబీ, ఖరీఫ్ సీజన్లలో కలిపి 1,41,081 హెక్టార్లలో మిర్చి సాగైంది. ఇందులో గుంటూరు జిల్లాది ప్రథమ స్థానం.
► హెక్టార్‌కు సగటున 6.25 టన్నుల దిగుబడి అనుకుంటే సుమారు 8.82 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా.
► లాక్‌డౌన్ ఆంక్షల్ని సడలించడంతో మిర్చి కోతలకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కూలీల కొరత తీరింది. కళ్లాల్లో గ్రేడింగ్ కూడా పూర్తయింది.
► ఇప్పటికి దాదాపు 85.90 శాతం విస్తీర్ణంలో కోతలు పూర్తయ్యాయి. మిగిలిన విస్తీర్ణంలో కూడా వారంలో కోతలు పూర్తవుతాయి.
► రాష్ట్రంలో 220కి పైగా కోల్డ్ స్టోరేజీలు ఉండగా.. ఒక్క గుంటూరు జిల్లాలోనే 130 ఉన్నాయి. వీటిలో మిర్చిని నిల్వ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే గిడ్డంగుల్లో 6 లక్షల టన్నులకు పైగా సరుకు నిల్వ ఉంది.
► మిర్చి యార్డు నిర్వాహకులు రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో యార్డుకు దూరంగా కొనుగోళ్లను ప్రారంభించే యోచనలో ఉన్నారు.
ఎగుమతుల కోసం కొనుగోళ్లు షురూ
► లాక్‌డౌన్‌కు ముందే రాష్ట్రంలో 1.50 లక్షల టన్నులకు పైగా మిర్చి కొనుగోళ్లు జరిగాయి. లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత సుమారు 12 వేల టన్నుల సరుకును రైతుల నుంచి కొనుగోలు చేశారు.
► గ్రేడ్‌ను బట్టి క్వింటాల్‌కు రూ.11 వేల నుంచి రూ.13వేల మధ్య పలికింది. తేజ రకం కాయలైతే క్వింటాల్ రూ.14 వేల వరకు ధర లభిస్తోంది.
► విదేశాలకు ఎగుమతి చేసే కంపెనీల తరఫున ఏజెంట్లు ఈనెల మొదటి వారం నుంచే రంగంలోకి దిగి చేలల్లోనే మిర్చి కొనుగోలు చేస్తున్నారు.
► లాక్‌డౌన్ ముగిశాక సరుకును తీసుకువెళ్లేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. గత నెల 20కి ముందు కొన్న సరుకును ఇటీవల కృష్ణపట్నం పోర్టు నుంచి విదేశాలకు పంపారు.
► ఇదే అదునుగా ఇతర రాష్ట్రాల వ్యాపారులు కూడా ఫోన్లలో స్థానిక ఏజెంట్లను సంప్రదించి గిడ్డంగుల్లో ఉన్న నాణ్యమైన మిర్చికి అడ్వాన్సులు ఇస్తున్నారు.
మిర్చి సాగులో ఏపీ టాప్
► మిర్చిని అత్యధికంగా పండిస్తున్న రాష్ట్రాల్లో ఏపీదే అగ్రస్థానం. సుమారు 26% ఉత్పత్తి రాష్ట్రం నుంచి వస్తుండగా.. మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
► రాష్ట్రంలో హెక్టార్‌కు సగటు దిగుబడి 6.25 టన్నులు. దేశం నుంచి 2018–19లో 4,68,500 టన్నుల మిర్చిని ఎగుమతి చేస్తే.. ఇందులో 1,43,000 టన్నులు రాష్ట్రం నుంచే వెళ్లాయి.
అకాల వర్షాల నుంచి గట్టెక్కితే చాలు
► రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించినందున మిర్చి రైతులెవరూ కంగారు పడాల్సిన పని లేదు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో ఏపీ మిర్చికి మంచి గిరాకీ వస్తుంది. ధర కూడా బాగా ఉంటుంది. తుది దశ కోతలు తప్ప చేలల్లో పెద్దగా పంట లేదు. కూలీల సమస్య కూడా లేదు. అకాల వర్షాల బెడద తప్ప మరే సమస్యా ఉండదు. మొత్తం ఉత్పత్తిలో 20 శాతం ఎగుమతులు ఉంటాయి. వాటి విలువ రూ.5 వేల కోట్ల నుంచి రూ.6 వేల కోట్ల వరకు ఉంటుంది.
– వెంకటేశ్వరరెడ్డి, మార్కెట్ యార్డు కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment