సాక్షి, అమరావతి: ‘మీకు ఓటర్లందరి పూర్తి సమాచారమిస్తున్నాం. ప్రతి ఒక్కరూ రెండు కుటుంబాలను టీడీపీకి అనుకూలంగా మార్చండి. ప్రతి బూత్ కమిటీ సభ్యుడు ఇలా చేస్తే ఒక్కో పోలింగ్ బూత్‌లో వెయ్యి నుంచి రెండు వేల ఓట్లు మనకు అదనంగా వస్తాయి. అప్పుడు ఎన్నికల్లో మన గెలుపు ఈజీ అవుతుంది..’ అని ఐటీ మంత్రి, సీఎం తనయుడు లోకేశ్ టీడీపీ సమావేశాల్లో కార్యకర్తలకు ఉద్బోధ చేస్తూ వచ్చినట్లు తెలిసింది. ఇందుకోసం ప్రజా సాధికార సర్వే డేటా మొత్తాన్ని సేవా మిత్ర యాప్‌కు అనుసంధానం చేశారు. దీన్ని ఉపయోగించుకొని రాష్ట్రంలోని ఐదు శాతం ఓటర్లను ప్రభావితం చేయడమే లక్ష్యంగా రెండేళ్లుగా టీడీపీ నాయకత్వం చాపకింద నీరులా పనిచేసింది. ఇందుకు టీడీపీ బూత్ కన్వీనర్లు, సభ్యులు, కొన్నిచోట్ల సాధికార మిత్రలను కూడా ఉపయోగించుకున్నారు. ప్రజాసాధికార సర్వే ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి చెందిన సమస్త సమాచారాన్ని సేకరించిన టీడీపీ ప్రభుత్వం.. ఇంతవరకు ఈ సర్వే పూర్తి వివరాలు మాత్రం బయటపెట్టలేదు. (ఓట్ల తొలగింపు కేసులు...తలలు పట్టుకుంటున్న పోలీసులు )
కానీ తన రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రం ఈ సమాచారాన్ని యథేచ్ఛగా దుర్వినియోగం చేసింది. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయో లేదో పరిశీలించే పేరుతో 25 వేల మంది సాధికార మిత్రలను నియమించారు. ప్రతి సాధికార మిత్రకు 35 కుటుంబాలను కేటాయించి.. వారిని స్థానికంగా ఉన్న టీడీపీ బూత్ కన్వీనర్లు, నాయకులకు అనుసంధానం చేశారు. ఆయా కుటుంబాల సమస్త సమాచారాన్ని సేవా మిత్ర యాప్ ద్వారా వీరికి అందించారు. టార్గెట్లు ఇచ్చారు. వారి అవసరాలను ఉపయోగించుకుని ఈ కుటుంబాల్లో కనీసం రెండింటినైనా టీడీపీ వైపు ఆకర్షించే బాధ్యతను వారికి అప్పగించారు. రెండు కుటుంబాలంటే సరాసరిన పది ఓట్లుగా లెక్కించారు. ఇలా ఒక్కో పోలింగ్ బూత్ పరిధిలో ఐదు శాతం ఓట్లు, నియోజకవర్గ స్థాయిలో సుమారు పది వేల ఓట్లను ప్రభావితం చేసేలా ప్లాన్ రూపొందించారు. టీడీపీ వైపు రాకపోయినా, వైఎస్సార్‌సీపీకి మద్దతుగా ఉన్నా.. ఆయా కుటుంబాల్లోని వారందరి ఓట్లను తొలగించారు. (ఇబ్బందికర డేటాను తొలగించండి..)
Comments
Please login to add a commentAdd a comment