తెలంగాణ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు అనుసరిస్తున్న విధానంతో ఆ పార్టీ నాయకుల దిమ్మ తిరిగి పోతోంది.. తెలంగాణకు అనుకూలంగా బాబు లేఖ ఇవ్వడం వల్లే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చిందని టీటీడీపీ నేతలు కాలరు ఎగరేస్తున్నారు. కానీ, వాస్తవ తీరు అందుకు విరుద్ధంగా ఉండడంతో పాలుపోని తమ్ముళ్లు టీడీపీకి నీళ్లొదిలి కాంగ్రెస్ శరణుజొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు..!!
సాక్షిప్రతినిధి, నల్లగొండ: జిల్లా టీడీపీలో ఇపుడంతా అయోమయం రాజ్యమేలుతోంది. తమ అధినేత తీరుతో ఏమీ పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో భువనగిరి, తుంగతుర్తి, కోదాడ అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకున్న ఆ పార్టీ కొంతలో కొంతనయం అనిపించుకుంది. కానీ, గడిచిన మూడేళ్లుగా పార్టీ పరిస్థితి ఏమంత బాగోలేదు. సహకార, పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా బయటపడింది. ఈలోగా కాంగ్రెస్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించడంతో టీడీపీ కుడితిలో పడ్డ ఎలుక లాగా గిలగిల కొట్టుకుంటోంది. రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ చంద్రబాబు రోజుకో విధంగా మాట్లాడుతున్న తీరుతో విసిగిపోతున్నారు. ఇక, తమకు రాజకీయ భవిష్యత్ ఉండదన్న భయం పట్టుకున్న ఆ పార్టీ నేతలు ప్రత్యామ్నాయాల వేటలో పడ్డారు. తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లకు ఊపు వచ్చిందని అభిప్రాయానికి వచ్చిన కొందరు టీడీపీ నాయకులు మాతృపార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడమే బెటరన్న నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆ పార్టీకి ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరు ఈ మేరకు పావులు కదిపారని తెలుస్తోంది. ఈ వ్యవహారానికి ఢిల్లీ వేదిక అయ్యిందని వినికిడి.
తెలంగాణలోని ఇతర జిల్లాలకు చెందిన మరికొందరు ఎమ్మెల్యేలతో కలిసి ఈ జిల్లాకు చెందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌ను కలిశారని తెలిసింది. టీడీపీ ఎమ్మెల్యేలుగా పార్టీ మారితే కాంగ్రెస్‌కు లాభం చేకూరడంతో పాటు, టీడీపీని దెబ్బకొట్టినట్లు ఉంటుందని వీరు చెప్పుకున్నారని సమాచారం. అయితే, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి ఎన్నికల ఖర్చుల కోసం ఒక్కో ఎమ్మెల్యేకు రూ.3కోట్లు ఇవ్వాలన్న కండీషన్ పెట్టారని అంటున్నారు. అయితే, ఎదురుడబ్బులు చెల్లించి తమ పార్టీలోకి ఆహ్వానించాల్సిన అవసరం లేదని, పార్టీ తరపున ఎన్నికల ఖర్చులకు డబ్బులు చెల్లించాల్సి వస్తే, అది ముందుగా, ఎస్టీ, ఆ తర్వాత ఎస్సీ, బీసీ, వర్గాలకు చెందిన నేతల నియోజకవర్గాల్లో అవసరాన్ని బట్టి ఉంటుందని కాంగ్రెస్ నేతలు జవాబివ్వడంతో వెనుదిరిగారని తెలుస్తోంది.
జిల్లాలో వాస్తవ రాజకీయ పరిస్థితిని విశ్లేషించినా, ఈసారి టీడీపీ పరిస్థితి అత్యంత దయనీయంగా కనిపిస్తోంది. ఎక్కడికక్కడ కేడర్‌లో పూర్తిస్థాయిలో నిస్తేజం ఆవరించి ఉంది. తుంగతుర్తిలో తన పరిస్థితి తారుమారైందని గమనించిన ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు సొంత స్థానం ఆలేరుకు తిరుగుటపా కడుతున్నట్లు ఇటీవలే ప్రకటించారు. కోదాడలో ఎమ్మెల్యే చందర్‌రావు లాభం లేదనుకున్న తర్వాతే బీసీవర్గానికి చెందిన బొల్లం మల్లయ్యయాదవ్‌కు పచ్చజెండా ఊపి పార్టీలోకి తీసుకున్నారు. టీడీపీ బీసీ డిక్లరేషన్‌లో భాగంగా ఇస్తామని ప్రకటించిన వందస్థానాల్లో కోదాడ ఉంటుందన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.
దీనిలో భాగంగానే మల్లయ్యయాదవ్‌ను తీసుకున్నారన్న వాదనా ఉంది. ఇదే కనుక కార్యరూపం దాలిస్తే చందర్‌రావుకు రెడ్‌సిగ్నల్ పడినట్టే. భువనగిరిలో ఎమ్మెల్యే ఉమామాధవరెడ్డికి గతంలో ఉన్నంత అనుకూలమైన వాతావరణం ఏమీ లేదు. తెలంగాణవాదపు ఓటు ఇక్కడ అత్యంత కీలకం. ఉమామాధవరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నారన్న ప్రచారం కూడా గతంలో ఒకింత జోరుగానే సాగింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకునే పార్టీకి ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరు కాంగ్రెస్ వైపు చూశారని, మంతనాలు జరిపారని అంటున్నారు. అయితే, ఆ ఎమ్మెల్యేలు ఎవరన్నదే ఇపుడు టీడీపీలో హాట్ టాపిక్.
‘చేయి’ కలుపుతాం!
Published Thu, Oct 17 2013 4:52 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement