ఏపీ పరువు తీశారు | AP Police Obstruct IT Grids Data Breach Case | Sakshi
Sakshi News home page

ఏపీ పరువు తీశారు

Published Tue, Mar 5 2019 8:40 AM | Last Updated on Tue, Mar 5 2019 6:53 PM

AP Police Obstruct IT Grids Data Breach Case - Sakshi

సాక్షి, గుంటూరు: రాష్ట్ర పోలీసుల ప్రతిష్ట దిగజారిందా.. వారిని అడ్డుపెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆడిన డేంజర్‌ గేమ్‌ వికటించిందా.. ప్రస్తుతం రాష్ట్ర  ప్రజల నుంచి వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవే. ఓ ప్రైవేటు ఐటీ కంపెనీ చేస్తున్న డేటా చోరీపై తమకందిన ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించిన తెలంగాణ పోలీసులను అడ్డుకునేందుకు రాష్ట్ర పోలీసులు హుటాహుటిన హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం ఏం వచ్చింది.. ఐటీ గ్రిడ్స్‌ మేనేజర్‌ వాట్సాప్‌ మెసేజ్‌ ఆధారంగా మిస్సింగ్‌ కేసు నమోదుచేసి డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో వందల మంది పోలీసులు అక్కడకు ఎందుకు వెళ్లారు?.. ఏపీ పోలీసులు మిస్సైనట్లుగా చెబుతున్న ఐటీ గ్రిడ్స్‌ ఉద్యోగి భాస్కర్‌తోపాటు, మరో ముగ్గురు ఉద్యోగులు సైతం తమ వద్దే ఉన్నారంటూ తెలంగాణ పోలీసులు చెప్పినప్పటికీ ఏపీ పోలీసులు హడావుడి చేయడానికి కారణం ఏంటి?.. చివరకు ఐటీ గ్రిడ్స్‌ కంపెనీపై ఫిర్యాదు చేసిన లోకేష్‌రెడ్డిపై బెదిరింపులకు పాల్పడాల్సిన అవసరం ఏం వచ్చింది?.. దీంతో వారిపై కేసు నమోదు కావడం చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి పోలీసు శాఖ పరువును తీసిందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐటీ గ్రిడ్స్‌పై తెలంగాణ పోలీసులు దాడిచేస్తే తమ తప్పేమీ లేనప్పుడు ప్రభుత్వ పెద్దలు ఎందుకు ఉలిక్కిపడ్డారన్న ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తోంది. (అదో ‘బ్లాక్‌మెయిల్‌’ యాప్‌)

2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలీసు శాఖను నిర్వీర్యం చేస్తోందనే ఆరోపణలున్న విషయం తెలిసిందే. పలు కేసుల్లో ఏపీ పోలీసులపై తమకు నమ్మకం లేదంటూ బాధితులు తెలంగాణ పోలీసులను ఆశ్రయిస్తున్న సందర్భాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ గ్రిడ్స్‌ అధినేత దాకవరపు అశోక్‌.. తమ కార్యాలయంలో పనిచేస్తున్న భాస్కర్‌ అనే ఉద్యోగి గతనెల 28న పెదకాకాని మండలం ఐజేఎం అపార్టుమెంట్‌ వద్ద నుంచి హైదరాబాద్‌ బయల్దేరుతున్నట్లుగా ఫోన్‌ చేశారని, ఆ తరువాత కనిపించడం లేదంటూ గుంటూరు అర్బన్‌ ఎస్పీ విజయరావుకు వాట్సాప్‌ మెసేజ్‌ ద్వారా ఫిర్యాదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు హుటాహుటిన హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఓ మిస్సింగ్‌ కేసులో డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో వందలాది మంది పోలీసులు ఐటీ గ్రిడ్స్‌ వద్దకు చేరుకోవడం చూస్తుంటే పక్కా పథకం ప్రకారం పోలీసులను హైదరాబాద్‌కు పంపేందుకే మిస్సింగ్‌ డ్రామా ఆడారనే విషయం స్పష్టమవుతోంది.(చంద్రబాబు, లోకేశ్‌ మార్గదర్శనంలో...క్యాష్‌ ఫర్‌ ట్వీట్‌!)

కాగా, భాస్కర్‌ తమ అదుపులో ఉన్నట్లు తెలంగాణ పోలీసులు చెప్పినప్పటికీ ఏపీ పోలీసులు హైదరాబాద్‌లోనే ఉండి తెలంగాణ పోలీసులు మిమ్మల్ని ఏమడిగారంటూ ఐటీ గ్రిడ్‌ సిబ్బంది కుటుంబ సభ్యులను ఆరా తీయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. అంతేకాక, ఐటీ గ్రిడ్స్‌పై ఫిర్యాదు చేసిన లోకేష్‌రెడ్డి ఇంటిపై దాడిచేసి అతనిని బెదిరించి అపహరణకు యత్నించడం చూస్తుంటే పోలీసులు ఎంత అత్యుత్సాహం ప్రదర్శించారో అర్ధమవుతుంది. ఏపీ పోలీసుల తీరును సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ పోలీసులు గుంటూరుకు చెందిన ఓ డీఎస్పీ, సీఐలపై కేసు నమోదు చేశారు. వీరి తీరును సైబరాబాద్‌ సీపీ తప్పుపట్టడంతోపాటు కేసును తప్పుదారి పట్టించేందుకు ఏపీ పోలీసులు యత్నించారంటూ మండిపడ్డారు. మరోవైపు.. హైకోర్టు హెబియస్‌ కార్పస్‌ రిట్‌ను కొట్టివేసి ఐటీ గ్రిడ్స్‌పై పోలీసుల విచారణలో జోక్యం చేసుకోలేమంటూ తేల్చిచెప్పడంతో ఏపీ ప్రభుత్వం, పోలీసుల పరువు పోయింది. ఎన్నికల సంఘం సైతం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవడంతో ఎవరిపై వేటు పడుతుందోనని గుంటూరు అర్బన్‌ పోలీసులు హడలిపోతున్నారు. (డేటా స్కామ్‌ డొంక కదులుతోంది!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement