కూలిన శ్లాబు శిథిలాలను లారీలో తరలిస్తున్న దృశ్యం
సాక్షి, అమరావతి బ్యూరో : రాజధాని అమరావతిలోని తాత్కాలిక నిర్మాణాల్లో డొల్లతనం మరోమారు బట్టబయలైంది. గతంలో చిన్నపాటి వర్షాలకే తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాల్లో సంభవించిన లీకేజీలను మర్చిపోక ముందే తాజాగా తాత్కాలిక హైకోర్టు భవనంలోని జనరేటర్ గదులకు సంబంధించిన శ్లాబ్ కూలడంతో ఈ భవనం నాణ్యతపై కూడా అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. వివరాలు..
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నేలపాడు గ్రామంలో తాత్కాలిక హైకోర్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. జనరేటర్ రూంకు సంబంధించి ఆరు గదులను నిర్మిస్తుండగా అందులో రెండు గదుల్లోని శ్లాబ్ శుక్రవారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలింది.
అక్కడే పనిచేస్తున్న జార్ఖండ్‌కు చెందిన నలుగురు కూలీలు గాయపడడంతో అధికారులు హుటాహుటిన వారిని తాడేపల్లి సమీపంలోని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలించారు. కాగా, నిర్మాణాల్లో డొల్లతనం ఎక్కడ బయటపడుతోందోనన్న భయంతో సీఆర్‌డీఏ అధికారులు శనివారం మీడియా ప్రతినిధులు ఎవరినీ ఆ ఛాయలకు అనుమతించలేదు. నిర్మాణాలు జరుగుతున్న సమయంలో ఇలాంటి చిన్నచిన్న సంఘటనలు చోటుచేసుకుంటాయని.. ఈ విషయాన్ని రాద్ధాంతం చేయొద్దని అధికారులు హెచ్చరించారు. అక్కడే ఉన్న కూలీలతో కూడా మీడియాను మాట్లాడనివ్వలేదు. గాయపడిన కూలీలు.. వారి పేర్లు.. ఎక్కడ చికిత్స చేయిస్తున్నారు? అన్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి జారుకున్నారు.
ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్లనీయకుండా మీడియాను అడ్డుకుంటున్న సెక్యూరిటీ సిబ్బంది
ప్రమాదాన్ని సుమోటాగా తీసుకోవాలి
తాత్కాలిక హైకోర్టు వద్ద జరిగిన ప్రమాదాన్ని హైకోర్టు సుమోటా తీసుకుని విచారణ జరిపించాలని హైకోర్టు న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. నిర్మాణంలో పాటిస్తున్న ప్రమాణాలు, నాణ్యత వంటి విషయాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీ వేయాలని వారు కోరుతున్నారు. నాణ్యత, భద్రత విషయాల్లో రాజీపడితే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉందని, హడావుడిగా నిర్మాణాలు చేస్తున్న క్రమంలో నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలిచ్చే అవకాశం ఉందని వారు అనుమానం వ్యక్తంచేశారు. ఇదే విషయమై హైకోర్టు న్యాయవాది ఓలేటి లక్ష్మీనారాయణ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. బార్ కౌన్సిల్ సభ్యులతో కలిసి మంగళవారం తాత్కాలిక హైకోర్టు నిర్మాణంలో పాటిస్తున్న భద్రతా ప్రమాణాలు, నాణ్యతను పరిశీలిస్తామని చెప్పారు.
అందుబాటులో లేని ‘108’
ఇదిలా ఉంటే.. రాజధాని ప్రాంతంలో ఒక్క 108 వాహనాన్ని కూడా ఏర్పాటుచేయకపోవడం గమనార్హం. తుళ్లూరు మండలంలో ఉన్న ఏకైక వాహనానికి డ్రైవర్ లేకపోవడంతో సర్వీస్ నిలిచిపోయింది. హైకోర్టు వద్ద ప్రమాదం జరిగిన సమయలో 108 వాహనం అందుబాటులో లేకపోవడంతో కారులో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్ కూడా అందుబాటులో లేకపోవడంపై కూలీలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment