మాట్లాడుతున్న ద్వారకానాథ్, పక్కన కుప్పం ప్రసాద్
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక రంగం తలకిందులైన తరుణంలోనూ ప్రజలకిచ్చిన వాగ్దానాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేర్చుకుంటూ పోతున్నారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఏడాదిలోపే ఆర్యవైశ్య కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడమేగాక రూ.50 కోట్ల నిధులు మంజూరు చేశారని రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్ అన్నారు. శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వారు సంయుక్తంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో వైఎస్సార్ హయాంలో ఆర్యవైశ్యులకు ఎలా మేలు జరిగిందో.. అలాగే నేడు వైఎస్ జగన్ ఆధ్వర్యంలో మరింత మేలు జరుగుతోందని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి తొలి నుంచీ ఆర్యవైశ్యులంటే ప్రత్యేకమైన అభిమానం ఉందని, ఆయన హయాంలోనే ఆర్యవైశ్యులే కన్యకాపరమేశ్వరి దేవస్థానాలు, సత్రాలు చూసుకునేలా జీవోలు ఇచ్చారని తెలిపారు. గతంలో తాము అడిగిందే తడవుగా నెల్లూరు జిల్లాకు పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాగా వైఎస్ నామకరణం చేశారన్నారు. వారింకా ఏమన్నారంటే...
బాబు మోసం చేశారు..
► టీడీపీ అధినేత చంద్రబాబు గతంలో వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి మోసం చేశారు. ఆర్యవైశ్యులకు కార్పొరేషన్ ద్వారా రూ.30 కోట్లు ఇస్తామని చెప్పి.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. గతంలో రాష్ట్రంలోని ఆర్యవైశ్య ప్రముఖులు కట్టించిన ఎన్నో సత్రాలు, ఆలయాలన్నీ దేవదాయ శాఖ పరిధిలోకి వెళ్లిపోయాయి.
► మేము అడిగిన తరువాత మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం ఆర్యవైశ్యుల ఆస్తులు వాళ్లే నిర్వహించుకునేలా ముఖ్యమంత్రి జగన్ చెప్పటం గర్వకారణం. ఇళ్ల పట్టాలు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లోనూ వైశ్యులు భాగస్వాములు అవ్వటం సంతోషంగా ఉంది. గతంలో వైఎస్సార్– కె.రోశయ్య ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులకు ఎలా మేలు జరిగిందో.. అలాగే నేడు జగన్–వెలంపల్లి ఆధ్వర్యంలో మరింత మేలు జరుగుతోంది.
ఆర్యవైశ్యుల కల నెరవేర్చారు..
► ఆర్యవైశ్యులకో కార్పొరేషన్ కావాలనేది ఎప్పటినుంచో ఉన్న కల. దానిని సీఎం వైఎస్ జగన్ నెరవేర్చారు. మేము నిధులు అడగ్గానే రూ.50 కోట్లను మంజూరు చేశారు. తరువాత మరో రూ.50 కోట్లు ఇస్తామన్నారు. టీటీడీ బోర్డులో ఇద్దరు ఆర్యవైశ్యులను నియమించారు. ఏపీ ఆర్టీఐ కమిషనర్‌గా రేపాల శ్రీనివాస్‌ను నియమించారు. అన్నవరం, కనకదుర్గ, ద్వారకా తిరుమల క్షేత్రాల్లో ఆర్యవైశ్యులకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. వెలంపల్లి శ్రీనివాస్ గారికి మంత్రిమండలిలో స్థానం కల్పించారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఆర్యవైశ్యులపై చూపిస్తున్న ప్రేమను చూసే మద్దాలి గిరి, శిద్దా రాఘవరావు వంటి ఆర్యవైశ్య ప్రముఖులు మద్దతు పలికారు.
► చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా ఒక్క వైఎస్ కుటుంబానికే సాధ్యం. ఆర్యవైశ్యుల పట్ల ఆ కుటుంబానికి ఉన్నటువంటి ప్రేమ, అభిమానం ఎంతో గొప్పది. ఇప్పటివరకు జగన్ మాదిరిగా ఇంత ప్రాధాన్యత కలిగిన పదవులను వైశ్యులకు ఎవ్వరూ ఇవ్వలేదు.
Comments
Please login to add a commentAdd a comment